Group 1 : గ్రూప్-1 అక్రమాలపై ‘సిట్’ ఏర్పాటు!
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన 2018 గ్రూప్-1 నియామక ప్రక్రియ ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకుంది. గత కొంతకాలంగా అభ్యర్థులు చేస్తున్న న్యాయపోరాటం ఫలితంగా, హైకోర్టు ఇచ్చిన సంచలన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రత్యేక విచారణ బృందాన్ని’ (SIT) ఏర్పాటు చేసింది. సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ బృందం, నియామక ప్రక్రియలో జరిగిన ప్రతి అంగుళాన్ని జల్లెడ పట్టనుంది.
ఈ కేసులో ప్రధాన ఆరోపణ డిజిటల్ మూల్యాంకనం. 2018 నోటిఫికేషన్ ప్రకారం జవాబు పత్రాలను మాన్యువల్ గా దిద్దాల్సి ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా డిజిటల్ పద్ధతిని అనుసరించడం తొలి తప్పిదంగా కోర్టు గుర్తించింది. ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలతో చేపట్టిన మాన్యువల్ మూల్యాంకనంలో కూడా భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా నిబంధనల ప్రకారం ప్రభుత్వ భవనాల్లో జరగాల్సిన ఈ ప్రక్రియను, అప్పటి కమిషన్ కార్యదర్శి నేతృత్వంలో గుంటూరు సమీపంలోని ‘హాయ్‌ల్యాండ్’ రిసార్ట్స్‌కు తరలించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దాదాపు 65 రోజుల పాటు జవాబు పత్రాలు ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉండటం ట్యాంపరింగ్‌కు తావిచ్చిందని భావిస్తున్నారు. నిష్ణాతులైన ప్రొఫెసర్లతో దిద్దించాల్సిన పేపర్లను, కేవలం డేటా ఎంట్రీ ఆపరేటర్లు, క్లర్కులు, ప్రైవేటు వ్యక్తులతో దిద్దించారనేది పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిన నగ్నసత్యం.
ఇవి కూడా చదవండి
హైకోర్టు జడ్జిలు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథ శర్మలతో కూడిన ధర్మాసనం ఈ విచారణను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించింది. ఈ క్రమంలో సిట్ కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా, రాష్ట్రం వెలుపలి కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (CFSL) నిపుణుల సహాయం తీసుకోనుంది. ఒరిజినల్ OMR షీట్లు, రీ-ప్రింట్ చేసిన బార్కోడ్లు ఒకదానితో ఒకటి సరిపోలుతున్నాయా? జవాబు పత్రాలపై ఉన్న సంతకాలు, చేతిరాతలు అసలైనవేనా లేక తారుమారు చేశారా? అనే అంశాలపై శాస్త్రీయ విచారణ జరగనుంది. ఇప్పటికే విచారణను ప్రభావితం చేయకుండా ఉండేందుకు, ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్న ఎంపికైన అభ్యర్థులను కీలక పోస్టుల నుండి అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయాలని కోర్టు ఆదేశించడం గమనార్హం.
మార్చి 16వ తేదీ లోపు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం సిట్ కు డెడ్‌లైన్ విధించింది. ఈ నివేదిక ఆధారంగానే 2018 గ్రూప్-1 నోటిఫికేషన్ భవితవ్యం ఆధారపడి ఉంది. ఒకవేళ అక్రమాలు నిజమని తేలితే, మొత్తం నియామక ప్రక్రియ రద్దయ్యే అవకాశం ఉంది లేదా అక్రమంగా ఎంపికైన వారిని తొలగించి మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేసే దిశగా అడుగులు పడవచ్చు.
సీఐడీ ఎస్పీ చక్రవర్తి వంటి సమర్థవంతమైన అధికారులు ఈ బృందంలో ఉండటంతో, తెరవెనుక చక్రం తిప్పిన రాజకీయ పెద్దల పేర్లు కూడా బయటకు వస్తాయని నిరుద్యోగ జేఏసీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. వ్యవస్థలోని లొసుగులను వాడుకుని అర్హులైన వారిని పక్కన పెట్టిన వారిపై ఈ ‘సిట్’ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
ఇవి కూడా చదవండి













