ఏలూరు కాలవలో..అదృశ్యమైన ఎంపీడీవో మృతదేహం..
జూలై 16న అదృశ్యమైన నరసాపురం ఎంపీడీవో మృతదేహం విజయవాడ శివార్లలోని ఏలూరు కాలవలో కనిపించడం అందరిని షాక్ కి గురిచేసింది.ఫెరీ నిర్వహణ బకాయిల వ్యవహారంలో ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ నరసాపురం ఎంపీడీవో స్థాయి అధికారి వెంకటరమణ అదృశ్యమైన విషయం అందరికీ తెలిసిందే. అతని కోసం పోలీసులు తీవ్రంగా గాలింపులు కూడా చేపట్టారు. అయితే ఎవరు ఊహించని విధంగా ఈరోజు ఆయన మృతదేహాన్ని ఏలూరు కాలవలో పోలీసులు గుర్తించారు. అదృశ్యమైన సుమారు వారం రోజుల తరువాత ఈ స్థితిలో వెంకటరమణ దొరకడంతో పోలీసులు.. సమగ్ర విచారణ చేపట్టనున్నారు. జూలై 17న ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపించాల్సిందిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఫెరీ బకాయిలకు సంబంధించిన పూర్తి వివరాలను తక్షణమే తనకు అందిన వాళ్ళని అధికారులను ఆదేశించారు.
పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఒక ఎంపీడీవో అదృశ్యమైన పరిస్థితులకు కారకులు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. జులై 15 నుంచి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ కనిపించకుండా పోయారు అన్న కథనాలు వినిపిస్తున్నాయి. విజయవాడలోని కానూరు మహదేవపురం కాలనీలో అతని కుటుంబం నివసిస్తుండగా.. నరసాపురంలో పని చేస్తున్న వెంకటరమణ సెలవు రోజుల్లో ఇంటికి వచ్చేవారు. జూలై 10 నుంచి 20 వరకు సెలవులపై కానూరుకు వచ్చారు. జులై 15 నాడు మచిలీపట్నం వెళ్తున్నాను అని ఇంటిలో చెప్పి బయలుదేరిన వెంకటరమణ అదే రోజు అర్ధరాత్రి 10 గంటలకు ఫోన్ చేసి బందరులో ఉన్నట్టు తెలియజేశారు.
ఇంటికి రావడం ఆలస్యం అవుతుందని భార్యతో చెప్పారట. ఆ తర్వాత తన పుట్టినరోజు అయిన జులై 16.. తాను చనిపోయే రోజు అని భార్యకు మెసేజ్ చేసి అందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు తెలుస్తోంది. ఆ మెసేజ్ చూసి కంగారు పడిన కుటుంబ సభ్యులు పెనమలూరు పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆయన మొబైల్ సిగ్నల్ ట్రాక్ చేశారు. విజయవాడలోని మధురానగర్ ఏలూరు కాల్వ వద్ద సిగ్నల్ కట్ అయినట్లు గుర్తించారు. ఏలూరు కాలవలో దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారేమో అన్న అనుమానంతో గత వారం రోజులుగా ఆ కాలువలోనే గాలింపులు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మృతదేహం విజయవాడ శివాలలోని ఏలూరు కాల్వలో లభ్యమయింది. ఇలా ఒక ఎంపీడీవో అదృశ్యం వ్యవహారం చివరికి విషాదంగా ముగిసింది. అయితే ఇది కేవలం ఆత్మహత్య లేక దీని వెనక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తులను నిర్వహిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.













