ఐటీడీపీపై నారా లోకేష్ గురి..!
తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయి నుంచి డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్ వరకు మరింత పటిష్టం చేసేలా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) కీలక అడుగులు వేస్తున్నారు. గురువారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి విచ్చేసిన ఆయన.. పార్టీ సోషల్ మీడియా విభాగమైన ఐ-టీడీపీ (iTDP) పై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐ-టీడీపీ బలోపేతం మరియు భవిష్యత్తు కార్యాచరణపై ప్రతినిధులకు అత్యంత స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
“రాజకీయాల్లో వ్యక్తుల కంటే వ్యవస్థే అత్యంత ముఖ్యం” అని చెబుతూ, పార్టీ కోసం పనిచేసే ప్రతీ ఒక్కరూ ఒక బలమైన వ్యవస్థలా మారాలని పిలుపునిచ్చారు. సమీక్షలో భాగంగా నారా లోకేష్ ఐ-టీడీపీకి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఐ-టీడీపీ కమిటీల నియామక ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. “కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మకమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలి” అని లోకేష్ పేర్కొన్నారు.
ప్రభుత్వ విజయాలను ప్రచారం చేయడంతో పాటు, ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేలా సోషల్ మీడియా సైన్యం సిద్ధంగా ఉండాలని హితవు పలికారు. ఐ-టీడీపీ సమీక్ష అనంతరం, పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘టీడీపీ ట్రైనింగ్ రిసోర్స్ పర్సన్స్’ తో నారా లోకేష్ ప్రత్యేకంగా ‘మీట్ అండ్ గ్రీట్’ (పరిచయ కార్యక్రమం) లో పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో క్యాడర్‌కు శిక్షణ ఇచ్చే ఈ ప్రతినిధులతో ముఖాముఖి మాట్లాడి, వారి సేవలను అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “పార్టీలో ఉన్న ప్రతీ నాయకుడు, కార్యకర్త కచ్చితంగా పార్టీ లైన్‌కు కట్టుబడి ఉండాలి. క్రమశిక్షణే తెలుగుదేశం పార్టీకి అసలైన బలం. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలి” అని లోకేష్ పిలుపునిచ్చారు. లోకేష్ స్వయంగా కేంద్ర కార్యాలయానికి వచ్చి వరుసగా సమీక్షలు నిర్వహించడంతో టీడీపీ శ్రేణుల్లో సరికొత్త జోష్ నెలకొంది.








