ఋతుపవనాల దెబ్బ.. తెలుగు రాష్ట్రాలకు భారీ షాక్..?
దేశవ్యాప్తంగా తీవ్రమైన ఎండలు(Summer), వడగాల్పులతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ ఒక చేదువార్త అందించింది. ఈ ఏడాది సాధారణం కంటే ముందుగానే మే 26వ తేదీన నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ శాఖ (IMD) మొదట అంచనా వేసింది. కానీ, ఆ గడువు ముగిసినా కేరళలో ఋతుపవనాల కదలికలు ఆశించిన స్థాయిలో లేవు. వాతావరణ శాఖ అంచనాలకు భిన్నంగా నైరుతి రాక మరింత ఆలస్యం అవుతోందని, జూన్ 4 లేదా 5 తేదీల్లో ఇవి కేరళ తీరానికి చేరుకునే అవకాశం ఉందని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ముందుగా వస్తాయనుకున్న ఋతుపవనాలను సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలు, తుఫాను వ్యవస్థలు అడ్డుకున్నట్లు వాతావరణ నిపుణులు చెప్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మార్పుల కారణంగా.. ఋతుపవనాల పురోగతికి అవసరమైన బలమైన పశ్చిమ గాలుల గమనం దెబ్బతింది. సముద్రం నుండి రావాల్సిన తేమతో కూడిన గాలుల తీవ్రత తగ్గడంతో ఋతుపవనాల రాక ఆలస్యమైంది. దీనివల్ల ఎండల తీవ్రత మరికొన్ని రోజుల పాటు కొనసాగే ప్రమాదం కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి
ఋతుపవనాలు కేరళను తాకడమే ఆలస్యమైతే.. ఇక తెలుగు రాష్ట్రాలకు ఇప్పట్లో వర్షాలు రావడం కష్టమనే వాస్తవాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా కేరళను తాకిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఋతుపవనాలు విస్తరించడానికి కనీసం వారం నుండి పది రోజుల సమయం పడుతుంది. తాజా ఆలస్యం ప్రకారం చూస్తే జూన్ మధ్య నాటికి గానీ తెలుగు రాష్ట్రాల్లో ఋతుపవనాల ప్రభావం కనిపించకపోవచ్చు. ఇది ఖరీఫ్ సాగు ప్రారంభించాలనుకునే రైతులకు పెద్ద షాక్ అనే చెప్పాలి.
ఈ ఏడాది పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న ‘ఎల్ నినో’ (El Nino) వాతావరణ పరిస్థితుల ప్రభావం కూడా ఋతుపవనాలపై బలంగా పడే అవకాశం ఉందని అంతర్జాతీయ క్లైమేట్ మోడల్స్ హెచ్చరిస్తున్నాయి. ఎల్ నినో ప్రభావం వల్ల జూన్, జూలై నెలల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే ప్రమాదం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే రిజర్వాయర్లలో నీటి మట్టాలు అడుగంటడంతో.. జూన్ రెండో వారం దాటినా వర్షాలు పడకపోతే తాగునీరు, సాగునీటి ఎద్దడి మరింత తీవ్రమయ్యే ముప్పు పొంచి ఉంది.
ఇవి కూడా చదవండి







