టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్
ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి వినతుల స్వీకరణ
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ
అమరావతి: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గురువారం ఉదయం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలపై పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ప్రజలు, కార్యకర్తలను కలుసుకున్నారు. వారి నుంచి అర్జీలు స్వీకరించారు. రాష్ట్రంలో గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ వ్యవస్థలో విధులు నిర్వహిస్తున్న సంక్షేమ, విద్యా సహాయకులకు ప్రమోషన్ ఛానల్ కల్పించడంతో పాటు విద్యాశాఖలో పదోన్నతి అవకాశాలు కల్పించాలని వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. గిరిజన బంజారా తండాల్లోని గుడి పూజారులకు నెలకు రూ.15వేల గౌరవ వేతనం మంజూరు చేయడంతో పాటు బంజారా దేవాలయాలకు ధూప, దీప, నైవేద్య పథకాన్ని వర్తింపజేయాలని బంజారా ధర్మ రక్షా సమితి ప్రతినిధులు కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గోపాలమిత్రలకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు గౌరవ వేతనం పెంచాలని రాష్ట్ర గోపాలమిత్ర సర్వీస్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం చీకటిపల్లె గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు శ్మశాన వాటికకు బీటీ రోడ్డు నిర్మించాలని సి.విజయ కుమార్ కోరారు. ఆయా వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.








