పవన్ గ్లాసు డైలాగ్ పై స్పందించిన ముఖేష్ కుమార్ మీనా..
పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. నిజానికి ఈ మూవీ ఎప్పుడో విడుదల అవ్వాల్సి ఉంది కానీ రాజకీయాలలో బిజీగా ఉన్న పవన్ కి షూటింగ్ కి వెళ్లే టైం లేకపోవడంతో ఇది వాయిదా పడుతూ వచ్చింది. ఇక రీసెంట్గా ఈ చిత్రం నుంచి ఓ మంచి మాస్ పవర్ఫుల్ టీజర్ విడుదల చేయడం జరిగింది. భారీ రెస్పాన్స్ సాధించిన ఈ టీజర్ పై ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పందించారు. ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ గ్లాస్ మీద ఓ పవర్ఫుల్ పంచ్ డైలాగ్ విసిరారు. జనసేనాని గుర్తు కూడా గ్లాసు కావడం గమనార్హం. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న ఈ నేపథ్యంలో ఇలా సినిమా టీజర్ లో పార్టీ గుర్తు గురించి ప్రస్తావించడం కూడా ఎన్నికల నియమాల ఉల్లంఘన కిందకి వస్తుంది అన్న చర్చ జోరుగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్న ముఖేష్ కుమార్ మీనా ఈ టీజర్లో గ్లాసు ప్రస్తావనపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న ఇలాంటి సమయంలో పార్టీ గుర్తు గురించి మీడియా ద్వారా ప్రచారం చేయటం నిబంధనలను ఉల్లంఘించినట్టే అవుతుంది అని ఆయన స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ ను తాను ఇంకా చూడలేదు అని చెప్పిన మీనా.. అందులో అభ్యంతరాలు ఉంటే కచ్చితంగా నోటీసులు పంపిస్తామని స్పష్టం చేశారు. మరి జనసేనాని దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.













