32 హుండీలు…రూ.21.5 లక్షల విరాళం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కుప్పం నియోజకవర్గ ప్రజలు మరోసారి తమ ప్రేమాభిమానాలు చాటుకున్నారు. ఎన్నికలప్పుడు ఆయన నామినేషన్ వ్యయంతో పాటు ఎన్నికల ఖర్చును స్థానిక ప్రజల నుంచి విరాళాల రూపంలో సేకరించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా టీడీపీ నాయకులు నియోజకవర్గంలో 15 రోజులు పర్యటించి 32 హుండీల ద్వారా విరాళాలు సేకరించారు. ఈ హుండీలను పార్టీ కార్యాలయంలో లెక్కించగా, మ్తొతం రూ.21,54,960 నగదు వచ్చింది. 2014 ఎన్నికల్లో ఇలా హుండీల ద్వారా రూ.18,17,260 నగదు విరాళాల రూపంలో లభించాయి. గత ఎన్నికల కంటే ఈసారి రూ.3,37,700 నగదు అధికంగా వచ్చింది. నామినేషన్ల కోసం ఖర్చు చేసిన వ్యయాన్ని ఈ విరాళాల సొమ్ముతో భర్తీ చేస్తామని టీడీపీ నాయకులు తెలిపారు.













