Arava Sridhar: వ్యక్తిగత వ్యవహారమే, పార్టీకి సంబంధం లేదు..మీడియా ముందుకు వచ్చిన అరవ శ్రీధర్..
మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జనసేన పార్టీ నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ (Arava Sridhar) ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలను పార్టీ వ్యవహారంగా చూడొద్దని, ఇది పూర్తిగా వ్యక్తిగతంగా తనకు, ఆ మహిళకు మధ్య జరిగిన అంశమని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో జనసేన పార్టీ పేరు గానీ, పార్టీ నేతల గురించి గానీ ఎవరూ మాట్లాడవద్దని కోరారు.
ఆ మహిళ చేసిన ఆరోపణలకు పార్టీతో ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. తాను ఇప్పటికే పార్టీ నియమించిన విచారణ కమిటీ ముందు హాజరై, తన వద్ద ఉన్న అన్ని విషయాలను వెల్లడించానని చెప్పారు. కమిటీ విచారణ అనంతరం పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానిని గౌరవిస్తానని, పాటించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అంతకు మించి ఈ అంశంపై మాట్లాడాల్సిన అవసరం లేదని పేర్కొంటూ, పార్టీ ప్రతిష్టకు భంగం కలగకుండా చూడాలని కోరారు.
ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత అరవ శ్రీధర్ కొంతకాలం మీడియాకు అందుబాటులో లేకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అదే సమయంలో ఆరోపణలు చేసిన మహిళ వరుసగా సెల్ఫీ వీడియోలు విడుదల చేయడం ద్వారా తన వాదనను ప్రజల ముందుకు తీసుకువచ్చారు. తనకు ఐదుసార్లు అబార్షన్ జరిగిందని, ఈ విషయంలో తాను ఎలాంటి డబ్బు డిమాండ్ చేయలేదని ఆమె వెల్లడించారు. భర్తతో విభేదాల కారణంగా వేరు వేరు గా ఉంటున్నామని, అయితే విడాకులు మాత్రం తీసుకోలేదని కూడా చెప్పారు.
ఈ మొత్తం వ్యవహారాన్ని జనసేన పార్టీకి అంటగట్టవద్దని, ఇది పార్టీకి సంబంధం లేని వ్యక్తిగత అంశమేనని ఆ మహిళ కూడా స్పష్టంగా చెప్పడం గమనార్హం. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై తనకు పూర్తి నమ్మకం ఉందని, ఈ విషయాన్ని ఆయనే న్యాయంగా పరిష్కరిస్తారనే విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో వ్యవహారం రాజకీయ కోణంతో పాటు భావోద్వేగ కోణంలోనూ చర్చకు వచ్చింది.
ఇదిలా ఉండగా, ఈ కేసు విచారణ కోసం జనసేన పార్టీ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ముందు మంగళవారం అరవ శ్రీధర్ హాజరయ్యారు. తనను ఉద్దేశపూర్వకంగా హనీ ట్రాప్లోకి లాగారని, దీని వెనుక వైసీపీ (YSRCP) హస్తం ఉందని ఆయన కమిటీకి వివరించినట్లు సమాచారం. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోగా, బుధవారం ఉదయం ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన వాదనను వెల్లడించారు.
ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపినప్పటికీ, పార్టీ స్థాయిలో విచారణ కొనసాగుతుండటంతో తదుపరి నిర్ణయాలపై ఆసక్తి నెలకొంది. పార్టీ ప్రతిష్ట, వ్యక్తిగత న్యాయం రెండింటి మధ్య సమతుల్యం ఎలా సాధిస్తారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చగా మారింది.








