టీటీడీ సంచలన నిర్ణయం
వైకుంఠ ద్వారం..సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కొలువైన వైకుంఠానికి ద్వారం. దీనిని ఉత్తర ద్వారమని కూడా అంటారు. అన్ని వైష్టవాలయాల్లో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో మాత్రమే ఈ ద్వారాల గుండా భక్తులను పంపి, స్వామి దర్శనానికి అనుమతిస్తారు. అప్పుడు మినహా సంవత్సరంలో మరెప్పుడూ ఆ ద్వారాన్ని తెరవరు. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దివ్వక్షేత్రంలోనూ ఇదే ఆనవాయితీ. అయితే, వైకుంఠ ద్వారాన్ని 10 రోజులు తెరచి ఉంచాలని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) భావిస్తోంది. ఈ పది రోజులూ ఇవే ద్వారాల గుండా భక్తులను అనుమతించేందుకు నిర్ణయించింది. ఆగమ శాస్త్ర నిపుణులు ఇందుకు అంగీకరించారని, పాలక మండలి ఆమోదం తరువాత నూతన విధానాన్ని అమలులోకి తెస్తామని అధికారులు అంటున్నారు.
వైకుంఠ ఏకాదశి నాడు ద్వారాలను తెరిచి, ఆపై 10 రోజుల పాటు వీటి గుండా భక్తులను పంపాలని, ఈ నిర్ణయం వల్ల రద్దీని గణనీయంగా తగ్గించవచ్చని, మరింత మందికి వైకుంఠ దర్శనం కల్పించే వీలు ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు. కాగా, జనవరి 6న వైకుంఠ ఏకాదశి రానుంది. పాలక మండలి అంగీకరిసే,్త అప్పటి నుంచి సంక్రాంతి పండుగ ముగిసే వరకూ ఈ ద్వారం తెరచుకునే ఉంటుందన్నమాట.













