ఏపీ మత్స్యకారులకు గుడ్ న్యూస్..!
ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత మత్స్యకారులకు సముద్ర, వాతావరణ పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని మరింత వేగంగా అందించే దిశగా ఒక చారిత్రాత్మక ముందడుగు పడింది. రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు(Sana Satish Babu) ప్రత్యేక చొరవ, నిరంతర కృషితో కాకినాడలో ప్రతిష్టాత్మక ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన భూమి గుర్తింపు ప్రక్రియ కూడా పూర్తయినట్లు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్, ఎంపీ సానా సతీష్ బాబుకు రాసిన అధికారిక లేఖలో స్పష్టం చేశారు.
ఈ ‘ఇన్కాయిస్’ ప్రాంతీయ కేంద్రం గనుక కాకినాడలో అందుబాటులోకి వస్తే… కాకినాడతో పాటు ఆంధ్రప్రదేశ్ పొడవునా ఉన్న తీర ప్రాంత మత్స్యకారులకు విప్లవాత్మకమైన సేవలు అందనున్నాయి. ముఖ్యంగా సముద్రంలో అలల తీవ్రత, తుఫానుల హెచ్చరికలు, చేపలు ఎక్కువగా లభ్యమయ్యే ప్రాంతాల సమాచారం మరియు వేట అనుకూల వాతావరణ పరిస్థితులకు సంబంధించిన అత్యంత కీలకమైన అప్డేట్స్ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో మత్స్యకారులకు మరింత వేగవంతంగా చేరతాయి.
దీనివల్ల వేటకు వెళ్లే వేలాది మంది మత్స్యకారుల ప్రాణాలకు రక్షణ లభించడంతో పాటు వారి జీవనోపాధి మరింత మెరుగవుతుంది. తీర ప్రాంత ప్రజల సంక్షేమం, భద్రత కోసం ఎంపీ సానా సతీష్ బాబు కేంద్ర ప్రభుత్వంపై తెచ్చిన ఒత్తిడి మరియు చూపిన ప్రత్యేక శ్రద్ధ వల్లే ఈ ప్రాజెక్టు అత్యంత వేగంగా పట్టాలెక్కుతోందని స్థానిక మత్స్యకార సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అత్యాధునిక సాంకేతిక సేవలను క్షేత్రస్థాయికి తీసుకువచ్చే ఈ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత ముఖచిత్రం మారడమే కాకుండా, సముద్ర పరిశోధనలకు కూడా కాకినాడ ఒక కీలక వేదికగా మారనుంది.








