ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్..!
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నాహాలు చేస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన తీపి కబురు అందించింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించి గరిష్ట వయోపరిమితిని పొడిగిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సడలింపును వచ్చే ఏడాది (2027) సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేర్వేరు అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తూ వయస్సు పైబడిపోతోందని ఆందోళన చెందుతున్న లక్షలాది మంది అభ్యర్థులకు ఈ నిర్ణయం కొండంత అండగా నిలవనుంది.
ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసిన వివరాల ప్రకారం… ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC)తో పాటు రాష్ట్రంలోని ఇతర నియామక సంస్థలు చేపట్టే అన్ని రకాల ఉద్యోగ భర్తీ ప్రక్రియలకు ఈ వయోపరిమితి పొడిగింపు వర్తిస్తుంది. ఇందులో భాగంగా పోలీస్, జైళ్లు, ఫైర్ వంటి యూనిఫాం సర్వీసుల ఉద్యోగాల విషయంలో జనరల్ కేటగిరీ (OC) అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని అదనంగా రెండేళ్ల పాటు పెంచారు. అలాగే నాన్-యూనిఫాం సర్వీసులకు సంబంధించి ఇతర నియామకాలన్నింటికీ గరిష్ట వయోపరిమితిని ప్రస్తుతం ఉన్న 34 ఏళ్ల నుంచి ఏకంగా 44 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది.
అయితే, జనరల్ కేటగిరీ అభ్యర్థుల వయోపరిమితి పెరిగినప్పటికీ… రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులకు ప్రస్తుతం అమల్లో ఉన్న అదనపు వయోపరిమితి సడలింపులలో ఎలాంటి మార్పు ఉండబోదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల ప్రకారం లభించే పాత సడలింపులు యథావిధిగా కొనసాగుతాయి. రానున్న రోజుల్లో ఏపీపీఎస్సీ ద్వారా భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు రాబోతున్న తరుణంలో, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిరుద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.








