ఆసియా క్రీడల్లో పతక విజేతలతో సీఎం చంద్రబాబు
రాష్ట్రం నుంచి ఎక్కువ మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించి, పతకాలు సాధించేలా పూర్తి స్థాయిలో ప్రోత్సాహం, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) స్పష్టం చేశారు. ఇటీవల జపాన్లో జరిగిన ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులు శ్రీచరణి (Sreecharani), గణేశ్ మణిరత్నం (Ganesh Maniratnam), ధీరజ్ బొమ్మదేవర, వెన్నం జ్యోతిసురేఖ (Vennam Jyothi Surekha) సచివాలయంలో చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. వీరు మూడు క్రీడాంశాల్లో 3 స్వర్ణాలు, రెండు రజతాలు, మూడు కాంస్యాలతో మొత్తం 8 పతకాలు సాధించారని సీఎంకు రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్) ఎంపీ భరణి (MP Bharani) వివరించారు. క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచి మాతృభూమి కీర్తిని నిలబెట్టారని చంద్రబాబు వారిని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విజేతలను శాలువాతో సత్కరించి, జ్ఞాపిక అందజేశారు.








