Chandrababu Naidu: త్వరలో ఏపీ సంక్షేమ క్యాలెండర్.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే రాష్ట్రంలో ‘సంక్షేమ క్యాలెండర్’ను విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు. కలెక్టర్లతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రాధాన్యతలు, పేదల సంక్షేమంపై దిశానిర్దేశం చేశారు.
లబ్ధిదారులకు సంక్షేమ లేఖలు:
పెట్టుబడులతో పాటు పేదల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు, ఉచిత సిలిండర్లు (దీపం 2.0), తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాల వివరాలను లబ్ధిదారులకు వివరించాలని, ఇందుకోసం ప్రజాప్రతినిధుల ద్వారా వారికి ప్రత్యేక లేఖలు అందజేయాలని ఆదేశించారు. దీపం 2.0 పథకానికి సంబంధించి ‘డిజిటల్ వోచర్’ జారీ చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులను కోరారు.
ఇవి కూడా చదవండి

ఉచిత బస్సు ప్రయాణం – పురోగతి:
రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంగా సాగుతోందని సీఎం వెల్లడించారు. మార్చి 9వ తేదీ నాటికి మహిళలు సుమారు 50.45 కోట్ల ప్రయాణాలు చేశారని, దీనికి సంబంధించి ప్రభుత్వం రూ. 1,775 కోట్లను ఆర్టీసీకి చెల్లించిందని వివరించారు. అలాగే, డ్వాక్రా, మెప్మా సంఘాల సహకారంతో ‘పీ4’ కార్యక్రమం ద్వారా పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించారు.
అటవీ శాఖ తీరుపై అసహనం:
అటవీ శాఖ అధికారుల తీరుపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు ‘పీపుల్ ఫ్రెండ్లీ’గా మారాలని, అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించవద్దని హెచ్చరించారు. శ్రీశైలంలో భక్తులను అడ్డుకోవడం, గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అటవీ శాఖ నిబంధనలు అడ్డురావడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. ఈ విషయంలో డిప్యూటీ సీఎంతో చర్చించానని, అధికారుల తీరు మారకపోతే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి








