22న సీఎం చంద్రబాబు నామినేషన్!
తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 22న కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. విదియ తిథితో కూడిన శుక్రవారం నామినేషన్ వేయడానికి మంచి ముహూర్తమని ఆ తేదీని నిర్ణయించారు. అయితే చంద్రబాబు గత మూడు దఫాలుగా ఎన్నడూ స్వయంగా వచ్చి నామినేషన్ వేయలేదు. ఆయన తరపున పార్టీలో స్థానిక ముఖ్యులే ఆ ప్రక్రియను పూర్తి చేస్తు వచ్చారు. 2014 ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ కుప్పం వచ్చి తండ్రి తరపున నామినేషన్ దాఖలు చేశారు. ఈ సారి ఆయన మంగళగిరి నుంచి పోటీ చేస్తుండడంతో అక్కడ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. సీఎం సతీమణి నారా భువనేశ్వరిని చంద్రబాబు తరపున నామినేషన్ దాఖలు చేయడానికి ఆహ్వానిస్తామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆమె రాలేకపోయిన పక్షంలో గతంలో మాదిరే టీడీపీకి చెందిన స్థానిక ముఖ్యులు టీడీపీ అధినేత తరపున నామినేషన్ పత్రాలు ఎన్నికల అధికారులకు అందజేస్తారని సమాచారం.













