పిఠాపురం ప్రోటోకాల్ రచ్చ, వర్మ తీరుపై సీఎం చంద్రబాబు సీరియస్..!
పిఠాపురం నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య నెలకొన్న ప్రోటోకాల్ వివాదం చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) దృష్టికి చేరింది. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (PADA) కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం ఫోటో విషయంలో మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ వ్యవహరించిన తీరుపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ఉదంతంపై ఏపీ టీడీపీ(TDP) రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. నియోజకవర్గంలో ఏం జరిగిందనే అంశంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇవి కూడా చదవండి
కూటమిలోని రెండు పార్టీలు ఐక్యంగా ఉండాల్సిన సమయంలో ఇలాంటి చిన్న విషయాలకు నేతలు ఘర్షణ పడటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఫ్లెక్సీపై తన ఫోటో లేదన్న కారణంతో వర్మ బ్యానర్లు చింపడం, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం వంటి చర్యలను ముఖ్యమంత్రి తప్పుబట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇలాంటి పరిణామాలు కూటమి మధ్య సమన్వయ లోపాన్ని సూచిస్తాయని, ఇది ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.
పిఠాపురం పడా కార్యాలయంలో ఎన్యుమరేటర్లకు మొబైల్స్ పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేవలం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో మాత్రమే ఉండి, సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడం వివాదానికి కారణమైంది. దీనిపై వర్మ అధికారులను ప్రశ్నించగా, జనసేన నేత పెండెం దొరబాబుతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరువురు నేతలు పరస్పరం తోపులాటకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. క్షేత్రస్థాయిలో ఇలాంటి గొడవలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తాయని, నేతలు సంయమనం పాటించాలని చంద్రబాబు సూచించారు. ఏదైనా సమస్య ఉంటే అంతర్గతంగా పరిష్కరించుకోవాలి తప్ప, బహిరంగంగా ఘర్షణలకు దిగవద్దని స్పష్టం చేశారు. వర్మ వ్యవహారంపై తగిన చర్యలు తీసుకోవాలని లేదా ఆయనకు వివరణ ఇవ్వాలని పార్టీ నాయకత్వానికి సూచించినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి







