టీడీపీ – జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందా..? చేరదా..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా ఇప్పుడు బీజేపీ వైపే చూస్తోంది. కూటమిలోకి ఆ పార్టీ కూడా కలిసొస్తుందని.. కలిసి రావాలని టీడీపీ – జనసేన గట్టిగా కోరుకుంటున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకూ బీజేపీ అధికారికంగా స్పందించలేదు. నేడో రేపో అంటూ అనధికారిక సమాచారం మాత్రం చక్కర్లు కొడుతోంది. టీడీపీ – జనసేన ఫస్ట్ లిస్ట్ ప్రకటించేశాయి కాబట్టి బీజేపీ కలవకపోవచ్చని కూడా చెప్తున్నారు. ఇంతకూ బీజేపీ మనసులో ఏముంది..? కూటమిలో చేరుతుందా.. చేరదా..?
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తోంది. కేంద్రంలోని బీజేపీతో స్నేహం కొనసాగిస్తోంది. అదే సమయంలో టీడీపీ – జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. ఇప్పటికే ఆ రెండు పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో సమన్వయం నడుస్తోంది. ఇప్పటికే ఉమ్మడిగా తాడేపల్లిగూడెంలో సభను ఏర్పాటు చేశాయి. అంతేకాక 99 స్థానాలకు అభ్యర్థులను కూడా అనౌన్స్ చేసేశాయి. ఒకవేళ బీజేపీ కలిసొస్తే మిగిలిన స్థానాల్లో సీట్ల సర్దుబాటు ఉంటుందని అభ్యర్థుల ప్రకటన రోజే చంద్రబాబు, పవన్ కల్యాణ్ వెల్లడించారు.
అయితే బీజేపీ మాత్రం ఇప్పటికీ కూటమిలో చేరికపై అధికారికంగా స్పందించలేదు. ఆ మధ్య ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన అమిత్ షా ఎన్డీయే కూటమిలోకి ఏపీలోని పాతమిత్రులు కూడా వస్తున్నట్టు చెప్పారు. దీంతో కూటమిలో బీజేపీ చేరడం ఖాయమనుకున్నారు. అయితే టీడీపీ, జనసేన లిస్టు అనౌన్స్ చేశాయి కాబట్టి బీజేపీ గుర్రుగా ఉందని.. అందుకే ఒంటరిగా వెళ్లేందుకే మొగ్గు చూపుతోందని ఓ వర్గం వెల్లడించింది. అయితే జగన్ పై వివేకా కుమార్తె వైఎస్ సునీత ఢిల్లీలో పెట్టిన ప్రెస్ మీట్ ను పక్కదోవ పట్టించేందుకే కొన్ని న్యూస్ చానళ్లు బీజేపీ అంశాన్ని తెరపైకి తెచ్చాయని కొందరు భావిస్తున్నారు.
అయితే టీడీపీ – జనసేన నేతలు మాత్రం పొత్తుపై ధీమాగా ఉన్నారు. ఐదో తేదీన దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎన్డీయేలో చేరేందుకు టీడీపీ ఒకటి – రెండు కీలక అంశాలపై పట్టుబడుతోందని.. అందుకే తర్జనభర్జన నడుస్తోందని తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని చంద్రబాబు కోరుతున్నట్టు సమాచారం. దానికి బీజేపీ సుముఖంగా ఉందని.. మిగిలిన అంశాలపై కాస్త సమయం పట్టొచ్చని విశ్వసనీయ సమాచారం. బీజేపీకి 4-5 లోక్ సభ స్థానాలు, 7-9 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు అంగీకారం కుదిరిందని తెలుస్తోంది. దీనిపై ఈ వారంలోనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.













