Alla Ramakrishna Reddy: మళ్లీ యాక్టివ్ అయిన ఆళ్ల.. వైసీపీలో గందరగోళం..!?
ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఈ పేరు తెలియని వారుండరు. మంగళగిరి ఎమ్మెల్యేగా, వైసీపీ కీలక నేతగా ఓ వెలుగు వెలిగారు. అయితే 2024 ఎన్నికల ముందు వైసీపీ నుంచి బయటికొచ్చారు. ఆ తర్వాత అటుఇటు తిరిగారు. రాజకీయంగా కూడా కామ్ అయిపోయారు. అయితే ఇటీవల ఉన్నట్టుండి ఆళ్ల రామకృష్ణా రెడ్డి పేరు మళ్లీ గట్టిగా వినిపిస్తోంది. ఆళ్ల యాక్టివ్ అవడానికి కారణమేంటని ఇప్పుడు అందరూ ఆరా తీస్తున్నారు.
మంగళగిరి రాజకీయాల్లో ఆళ్ల రామకృష్ణ రెడ్డి పేరు ఒక సంచలనం. 2014లో కేవలం 12 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచిన ఆయన, 2019లో సాక్షాత్తూ నారా లోకేష్‌ను ఓడించి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 2024లో ఆయనకు టికెట్ దొరకలేదు. దీంతో వైసీపీని వీడి కాంగ్రెస్ లో షర్మిల పంచన చేరారు. ఆ తర్వాత దాని నుంచి కూడా బయటికి వచ్చారు. ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ నియోజకవర్గంలో యాక్టివిటీ పెంచడం ముఖ్యంగా వైసీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.
వైసీపీకి అత్యంత విధేయుడిగా ఉన్న ఆర్కే, జగన్ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కుతుందని ఆశించి భంగపడ్డారు. ఆ అసంతృప్తితోనే షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టగానే వైసీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. అయితే, వెంటనే తిరిగి వైసీపీలోకి వచ్చినప్పటికీ, ఆయన తీసుకున్న ఆ నిర్ణయం జగన్‌కు ఆగ్రహం కలిగించిందని, అందుకే పార్టీలో ఆయనకు ప్రాధాన్యత తగ్గిందని రాజకీయ వర్గాల టాక్. 2024 ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వకుండా బీసీ అభ్యర్థి మురుగుడు లావణ్యకు కేటాయించడం ఆర్కే రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్మిందన్న సంకేతాలు ఇచ్చింది.
ఇవి కూడా చదవండి
కొంతకాలం మౌనంగా ఉన్న ఆర్కే, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుపై తాను గతంలో వేసిన కేసు ద్వారా మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఏసీబీ కోర్టు నుంచి సమన్లు రావడంతో, చంద్రబాబు ప్రభుత్వంపై మళ్లీ న్యాయపోరాటం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో మంగళగిరి నియోజకవర్గంలో పర్యటనలు ప్రారంభించారు. ఇటీవలే చనిపోయిన పార్టీ నేత కుటుంబాన్ని పరామర్శించడం, నేషనల్ స్కేటింగ్ ఛాంపియన్‌ను అభినందించడం వంటి కార్యక్రమాలతో క్యాడర్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రస్తుతం మంగళగిరి వైసీపీ సమన్వయకర్తగా దొంతిరెడ్డి వేమారెడ్డి కొనసాగుతున్నారు. ఈ తరుణంలో ఆర్కే మళ్లీ యాక్టివ్ అవ్వడం నియోజకవర్గ వైసీపీలో అలజడి సృష్టిస్తోంది. నియోజకవర్గంపై పట్టు కోసం ఆర్కే ప్రయత్నిస్తుంటే, ప్రస్తుతం బాధ్యతల్లో ఉన్న నేతలు దీన్ని ఎలా స్వీకరిస్తారనేది ప్రశ్నార్థకం. ఆర్కే యాక్టివిటీకి పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని, కేవలం తన ఉనికిని చాటుకోవడానికే ఆయన పర్యటిస్తున్నారని ఒక వర్గం వాదిస్తోంది. పాత నాయకుడా? లేక కొత్త సమన్వయకర్త వెనుక నడవాలా? అన్న గందరగోళంలో స్థానిక కార్యకర్తలు ఉన్నారు.
మంగళగిరిలో ఆర్కే మునుపటి పట్టును సాధించాలనుకుంటున్నారు. కానీ, గతంలో ఆయన పార్టీని వీడి వెళ్లిన అంశం జగన్ మనసులో ఇంకా ఉందా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ ఆర్కేను అధిష్టానం పక్కన పెడితే, ఆయన యాక్టివిటీ పార్టీలో చీలికకు దారితీసే ప్రమాదం ఉంది. మంగళగిరి కోటను తిరిగి దక్కించుకోవాలంటే వైసీపీలో ఈ అంతర్గత సమరం సద్దుమణగడం అత్యవసరం.
ఇవి కూడా చదవండి








