ప్రపంచంలోని అత్యుత్తమ సీఈవోల్లో ఆదిత్య పురి
ప్రపంచంలోని 30 మంది అత్యుత్తమ ముఖ్య కార్యనిర్వాహక అధికారుల (సీఈవో) జాబితాలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ ఆదిత్య పురికి చోటు దక్కింది. అమెరికాకు చెందిన ఫైనాన్షియల్ మ్యాగజైన్ బ్యారన్స్ ఈ లిస్ట్‌ను విడుదల చేసింది. 66 ఏండ్ల ఆదిత్య పురి స్టార్టప్‌గా ప్రారంభమైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు ప్రపంచంలోని అత్యంత నాణ్యమైన బ్యాంకుల సరసన నిలబెట్టారు. అంతేకాదు, రుణ మంజూరులో ఉన్నతమైన ప్రమాణాలను పాటిస్తూ కండ్లు మిరుమిట్లు గొలిపే లాభాలను ఆర్జించే బ్యాంకుగా తీర్చిదిద్దారని బ్యారన్స్ తన నివేదికలో పేర్కొంది. 2014 లో సిలికాన్ వ్యాలీని సందర్శించిన ఆదిత్య పురి డిజిటల్ సేవల ప్రాధానత్యతను గుర్తించారు. అందుకే బ్యాంకులో అన్ని సేవలకు డిజిటల్ పరిష్కారాలను అందిస్తున్నారు.













