రాజ్యాంగ సవరణతో నియోజక వర్గాల పెంపు?
శాసనసభ నియోజక వర్గాల పెంపు అంశంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. రాజ్యాంగ సవరణ ద్వారా పెంపు సుసాధ్యం చేయబోతున్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చింది. రాష్ట్ర పునర్విభజన నేపథ్యంలో నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేంద్రానికి లేఖ వెళ్లాయి. ఇప్పటికే ఈ అంశంపై రాజ్యాంగ, న్యాయ నిపుణులతో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించాయి. ఈ క్రమంలో రాజ్యాంగంలో ఆర్టికల్ 170లో సవరణ తీసుకురావడం ద్వారా పెంచుకొనే వీలు ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 170వ ఆర్టికల్ మూడు క్లాజులున్నాయి. మూడో క్లాజ్‌లో మూడు షరతులుంటాయి. నాలుగో షరతు చేర్చడం ద్వారా నియోజకవర్గాలను పెంచనున్నారు. ఈ షరతు ద్వారా రాష్ట్రాల పునర్విభజన జరిగిన పక్షంలో మూడో క్లాజ్‌లో మూడో షరతుతో సంబంధం లేకుండా శాసనసభ నియోజక వర్గాలను పెంచుకొనేలా వెసులుబాటు తీసుకొస్తారు. ఇందుకు సంబంధించిన దస్త్రం ప్రస్తుతం కేంద్ర హోం శాఖ దగ్గర ఉంది. రాజ్యాంగ సవరణ జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో 225 నియోజకవర్గాలవుతాయి. ప్రస్తుతం 175 నియోజకవర్గాలున్నాయి.













