రాజ్యసభ ఎన్నికల్లో అహ్మద్ పటేల్ గెలుపు
గుజరాత్ లో జరిగిన రాజ్యసభ ఎన్నికలలో.. 2 సీట్లను బీజేపీ, ఒక సీటును కాంగ్రెస్ గెలిచాయి. బీజేపీ నుంచి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గెలిచారు. మూడో అభ్యర్థిగా నిలబడ్డ బల్వంత్ సింగ్ రాజ్ పుత్.. ఓడిపోయారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్ విషయంలోనే.. అర్ధరాత్రి వరకు హై డ్రామా నడిచింది. కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేలు.. తాము బీజేపీకి ఓటు వేసి.. బయటికి చూపించడంపై.. ఆ పార్టీ అభ్యంతరం చెప్పింది. ఆ ఓట్లు చెల్లొద్దని ఈసీకి ఫిర్యాదు చేసింది. మరోవైపు.. బీజేపీ కూడ.. కాంగ్రెస్ పై ఈసీకి ఫిర్యాదు చేసింది. ఒకటికి రెండు సార్లు.. ఈసీతో 2 పార్టీల నేతలు సమావేశమై.. ఫిర్యాదులు చేసుకున్నారు. చివరికి.. వీడియో ఫూటేజ్ పరిశీలించిన ఈసీ.. ఇద్దరు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల ఓట్లను చెల్లవని తేల్చింది. దీంతో.. మూడో స్థానంలో గెలిచేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 45 నుంచి 44 కు తగ్గింది. కాంగ్రెస్ సభ్యులు 44 మంది.. అహ్మద్ పటేల్ కే ఓటు వేయడంతో.. ఆయన విజయం సాధించినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. బీజేపీ తరఫున గెలిచిన అమిత్ షా కు 46.. స్మృతీ ఇరానీకి 45 ఓట్లు వచ్చినట్టు ఈసీ తెలిపింది.
గుజరాత్ లో నిన్న రాత్రి వరకు టెన్షన్ పెట్టిన రాజ్యసభ ఎన్నికల్లో ఫలితాలపై.. పార్టీలు డైలాగ్ వార్ మొదలు పెట్టాయి. అహ్మద్ పటేల్ విజయాన్ని బీజేపీ నేతలు తప్పుబడ్తున్నారు. ఎన్నికల సంఘం నిర్ణయంపై.. న్యాయ పోరాటం చేస్తమన్నారు. మరోవైపు.. అహ్మద్ పటేల్ గెలుపుతో కాంగ్రెస్ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. గెలుపు సాధించిన వెంటనే.. సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేసిన అహ్మద్ పటేల్.. న్యాయమే గెలిచిందన్నారు. తనను ఓడించేందుకు బీజేపీ.. డబ్బును, అధికారాన్ని వాడిందన్నారు.













