యుద్ధక్షేత్రంలో పెద్దన్న…
హమాస్ -ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం సాగుతున్న సమయంలో పెద్దన్న అమెరికా… పరిస్థితి చేజారకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఓవైపు యుద్ధంలో మిత్రుడితో ఉన్న ఒప్పందం మేరకు.. సహాయంగా యుద్ధనౌకలు, సైన్యాన్ని పంపిస్తోంది. మరోవైపు ఇతర అరబ్బు దేశాలు… హమాస్‌కు వంతపాడకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది. అదే సమయంలో గాజాను ఆక్రమించినా, హమాస్‌ను తుదముట్టించి, కొద్దిసమయంలోనే వెనక్కు రావాలంటూ ఇజ్రాయెల్‌కు సూచనలు చేస్తోంది. అరబ్ దేశాలతో మాట్లాడుతూ పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది.
ఇన్నాళ్లు ఫోన్ సంభాషణలు, సూచనలకే పరిమితమైన అమెరికా అధ్యక్షుడు బైడెన్.. ఇవాళ ఇజ్రాయెల్‌లో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఇజ్రాయెల్‌లో పరిస్థితిని సమీక్షించిన తర్వాత ప్రధాని నెతన్యాహు సహా పలువురు కీలక నేతలతో సమావేశమవుతారు. మరీముఖ్యంగా తమ మద్దతును ఇజ్రాయెలీలకు ప్రకటించనున్నారు. తర్వాత ఆయన జోర్డాన్‌కూ వెళ్లనున్నట్లు సమాచారం.అక్కడ ఈజిప్ట్, పాలస్తీనా, జోర్డాన్ దేశాధినేతలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. పాలస్తీనా ప్రజల గౌరవం, స్వీయనిర్ణయాధికారాన్ని హమాస్ ప్రతిబింబించదని బైడెన్ ఈ భేటీలో పునరుద్ఘాటించనున్నట్లు సమాచారం. అదే సమయంలో గాజాలోని మానవతా సంక్షోభ నివారణ గురించి చర్చిస్తారని తెలుస్తోంది.
ఇప్పటికే బైడెన్ ఈజిప్ట్ అధ్యక్షుడితో పాటు ఇరాక్ ప్రధాని మహమ్మద్ శియా అల్- సుడానీతో ఫోన్లో మాట్లాడారు. హమాస్ దాడి తర్వాత ఆ ప్రాంతంలో పరిస్థితులపై ఆరా తీశారు. పరిస్థితులు మరింత దిగజారకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయా దేశాధినేతలు వెల్లడించారు. గాజాలో మానవతా సంక్షోభం, దాని నివారణకు ఐక్యరాజ్యసమితి సమన్వయంతో చేపడుతున్న చర్యలపైనా చర్చించారు. మరోవైపు హమాస్ మిలిటెంట్లకు అండగా నిలుస్తున్న ఇరాన్‌కు మాత్రం బైడెన్ పర్యటన తీవ్ర ఆగ్రహం తెప్పించే అంశంగా మారింది.మిలిటెంట్ గ్రూపులకు ఆయుధాలు అందకుండా తమ నిఘా విమానాన్ని మధ్యధరా సముద్ర ప్రాంతానికి పంపామని సునాక్ తెలిపారు. పౌరులపై యుద్ధ ప్రభావం పడకుండా చూడాలని నెతన్యాహుకు సూచించానని చెప్పారు.
హమాస్‌తో ఇజ్రాయెల్ పోరు తీవ్రమవుతున్న నేపథ్యంలో తమ సైనికులను అమెరికా సిద్ధం చేసినట్లు సమాచారం. ఏ క్షణమైనా ఇజ్రాయెల్‌కు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని దాదాపు రెండు వేల మంది సైనికులను పెంటగాన్ ఆదేశించినట్లు ఓ సీనియర్ సైనికాధికారి తెలిపారు. వీరిని వైద్యం, లాజిస్టిక్స్, సరిహద్దుల వద్ద అదనపు భద్రత వంటి విభాగాల్లో ఇజ్రాయెల్ సైనికులకు మద్దతుగా మోహరించే అవకాశం ఉందని వెల్లడించారు. మరోవైపు పశ్చిమాసియాలో తమ బలగాల వ్యవహారాలను చూస్తున్న అమెరికా సీనియర్ సైనికాధికారి ఒకరు …ఇజ్రాయెల్‌లో ఆకస్మికంగా పర్యటించడం.. అమెరికా సైనిక సన్నాహాలను సూచిస్తోంది.













