జో బిడెన్ జి-20 టూర్…
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఢిల్లీలో జరగనున్న జీ20 లీడర్స్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ భారత్ వస్తున్నారు. ఢిల్లీలో తన పర్యటన సందర్భంగా బిడెన్ యూఎస్ ప్రెసిడెన్షియల్ కాడిలాక్ ది బీస్ట్ లో ప్రయాణించనున్నారు. జో బిడెన్ కోసం ప్రత్యేకంగా ది బీస్ట్ కారు… యూఎస్ నుంచి బోయింగ్ సి-17 గ్లోబ్ మాస్టర్ III విమానంలో భారతదేశానికి పయనమైంది.
జో బిడెన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. బయటి పొరలో భారత పారామిలిటరీ ఫోర్స్ సిబ్బంది ఉంటారు. రెండవ లేయర్లో భారత స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ నకు చెందిన కమాండోలు ఉంటారు. లోపలి సర్కిల్లో అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఉంటారు. జో బిడెన్ ఇతర యూఎస్ ప్రతినిధులు ఐటీసీ మౌర్య షెరటన్ హోటల్లో బస చేస్తారు. బిడెన్ రాక సందర్భంగా హోటల్ వద్ద భారీగా బలగాలు మోహరించారు.
జో బిడెన్ బస చేసే 14వ అంతస్తును సందర్శించే వారికి ప్రత్యేక యాక్సెస్ కార్డులు ఇచ్చారు. కిందకి చేరుకోవడానికి ప్రత్యేక లిఫ్ట్‌ను ఏర్పాటు చేశారు. అమెరికా అధినేత కోసం ఈ హోటల్లో 400 గదులు బుక్ చేశారు. ప్రపంచంలోనే అత్యంత బలమైన, సురక్షితమైన కారుగా పేరొందిన ఈ బుల్లెట్ ప్రూఫ్ కారు అన్ని సమయాల్లో యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ రక్షణలో ఉంటుంది. భారత వాయుసేన, భారత సైన్యానికి చెందిన హెలికాప్టర్లు ఢిల్లీపై కన్ను వేస్తూ నిరంతరం ఆకాశంలో తిరుగుతున్నాయి.
ఈ హెలికాప్టర్లలో ఆర్మీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) కమాండోలు ఉంటారు. ఢిల్లీలో చాలా చోట్ల యాంటీ డ్రోన్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని ఎత్తైన భవనాలపై నేషనల్ సెక్యూరిటీ గార్డులు, ఆర్మీ స్నిపర్లను మోహరించారు. ఢిల్లీ పోలీసులు వివిధ దేశాల అడ్వాన్స్ టీమ్‌లతో సమన్వయం చేస్తున్నారు.
చారిత్రాత్మక జి 20 సమావేశం సందర్భంగా బిడెన్ ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు.సెప్టెంబర్ 9-10 తేదీల్లో జరిగే జి20 సమ్మిట్ అధికారిక సెషన్స్‌లో జో బిడెన్ పాల్గొంటారు.













