ఉగ్రవాదుల టార్గెట్ గా రష్యా..?
ప్రపంచ అగ్రదేశాల్లో ఒకటైనా రష్యా ఉగ్రదాడులతో వణుకుతోంది. ఎప్పుడు, ఎటువైపు నుంచి వచ్చి ఉగ్రవాదులు దాడులు చేస్తారో అర్థం కాక చేష్టలుడిగి చూస్తోంది. తాజాగా డాగేస్థాన్ ఉగ్రదాడి..రష్యాను ఆందోళనకు గురిచేసింది. ప్రార్థనా మందిరాలే టార్గెట్ గా ఉగ్రవాదులు చెలరేగారు. నిర్ధాక్షిణ్యంగా ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో పోలీసులు సహా 15 మంది మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.
ఉక్రెయిన్ పోరాటంలో తలమునకలైన రష్యా ..
ఇక రష్యా పూర్తిస్థాయిలో ఉక్రెయిన్ యుద్ధంలో తలమునకలై ఉండడంతో.. దేశ భద్రతపై అంతగా ఫోకస్ పెట్టలేకపోతున్నారు. ఇదే అదనుగా భావించి ఇటీవలి కాలంలో ఉగ్రవాదులు తరచూ రష్యాపై దాడులకు దిగుతున్నారు. పక్కనే ఉన్న తజ్బెకిస్తాన్ భూభాగం నుంచి ఉగ్రకుట్రలు జరుగుతున్నట్లు రష్యా అనుమానిస్తోంది. మొన్న మార్చినెలలో ఓ సంగీత కార్యక్రమంలో కాల్పులు జరిపిన ఉగ్రవాదులు.. 130 మందికి పైగా ప్రజల్ని బలితీసుకున్నారు. అది మరవకముందే మళ్లీ ఇలాంటిదాడి జరగడం.. రష్యన్లు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఐఎస్ఐఎస్ -కె హస్తముందా..?
మరోవైపు.. ఐఎస్ఐఎస్ -కె ఉగ్రదాడిగానూ కొందరు అనుమానిస్తున్నారు. ఎందుకంటే సెర్బియా పోరులో రష్యాదళాల సాయంతో ఐఎస్ఐఎస్ దళాలను అక్కడి ప్రభుత్వం అణిచేవేసింది. దీంతో ఆగ్రహించిన ఐఎస్ఐఎస్-కె… రష్యా టార్గెట్ గా తరచూ దాడులు చేస్తోంది. అయితే వీటిని అడ్డుకోవడంలో మాత్రం క్రెమ్లిన్ ఘోరంగా విఫలమవుతోంది. మొన్నటికి మొన్న సంగీత కార్యక్రమంలో జరిగిన దాడి, ఇప్పుడీ దాడి.. ఈ రెండింటికి సంబంధించి అమెరికా.. రష్యాను ముందుగానే అప్రమత్తం చేసింది. అయినా సరైన రక్షణ చర్యలు తీసుకోవడంలో రష్యా భద్రతాధికారులు విఫలమయ్యారు.
రష్యాపై వరుసగా ఉగ్రదాడులు
రష్యాకు ఉగ్రదాడులు కొత్తేమీ కాదు. ఇటీవలి కాలంలో ఉగ్రవాదులకు రష్యా టార్గెట్ గా మారింది.ముఖ్యంగా చెచెన్ వేర్పాటు వాదాన్ని ఉక్కుపిడికిలితో అణిచివేయడం.. అక్కడి ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. ప్రస్తుతమున్న చెచెన్ అధ్యక్షుడు కదిరోవ్..పుతిన్ కు చాలా దగ్గరి నేస్తం. దీంతో రష్యా సహకారంతో అక్కడి అసంతృప్తిని అణిచివేశారు. అంతేకాదు.. ఉక్రెయిన్ పై దాడికి సైతం తమవంతు సాయం చేస్తున్నట్లు సమాచారం. వీటన్నింటితో చెచెన్లలో అసంతృప్తి కనిపిస్తోంది. దీంతో పలువురు చెచెన్యా ప్రజలు.. ఉక్రెయిన్ కు అనుకూలంగా పోరాటంలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.
క్రెమ్లిన్ మాత్రం ఈదాడి వెనక ఉక్రెయిన్ ఉన్నట్లు అనుమానిస్తోంది.ఈదాడి ఎవరు చేయించారో తెలుసు.. వారు తగిన మూల్యం చెల్లిస్తారంటూ ఉక్రెయిన్ ను ఉద్దేశించి రష్యా రక్షణ వర్గాలు ప్రకటించాయి.అయితే ఇలాంటి దాడులు తమకు సమ్మతం కాదని.. తాము ఉగ్రవాద కార్యకలాపాలకు అవకాశమివ్వమంటోంది ఉక్రెయిన్.













