‘ఉగ్రవేట’ వెనక..?
పాకిస్తాన్ లో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద నేతలు వరుసగా మృత్యు వాత పడుతున్నారు. గుర్తు తెలియని దుండగుల దాడిలో వారు చనిపోతున్నారు. గ్రూపుల మధ్య తగాదా కావచ్చు, లేదా కొందరు టార్గెట్ చేసి చంపడం కావచ్చు. కానీ ఉగ్రనేతలు చనిపోతుండడం..పాకిస్తాన్ కు ఆందోళన కలిగిస్తున్నాయి.
భారత్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి వెనక మాస్టర్‌మైండ్, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది షాహిద్ లతీఫ్ హత్యకు గురయ్యాడు. పాకిస్థాన్ లోని సియాల్కోట్లో బుధవారం అతడిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపి చంపేశారు. ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌కు లతిఫ్ లాంచింగ్ కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాదానికి సంబంధించిన కేసుల్లో లతీఫ్ 1994 నవంబరులో జమ్మూకశ్మీర్‌లో అరెస్టయ్యాడు. 16 ఏళ్ల పాటు భారత జైల్లో శిక్ష అనుభవించిన అతడిని 2010లో వాఘా సరిహద్దు వద్ద పాకిస్థాన్‌కు అప్పగించారు. 1999లో భారత విమానాన్ని హైజాక్ చేసి అఫ్గానిస్థాన్‌లోని కాందహార్‌కు తీసుకెళ్లిన ఘటనలో లతీఫ్ నిందితుడిగా ఉన్నాడు.
పాకిస్థాన్ వేదికగా ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్న టాప్ కమాండర్ ఇలా దుండగుల కాల్పుల్లో మరణించడం ఈ ఏడాది ఐదో ఘటన కావడం దాయాది దేశానికి ఆందోళన కలిగిస్తోంది. గత నెల పాక్ ఆక్రమిత కశ్మీర్లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ రియాజ్ అహ్మద్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఏడాది మార్చిలో రావల్పిండిలో నిషేధిత హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ బషీర్ అహ్మద్ పీర్ను దుండగులు హత్య చేశారు. అంతకుముందు, ఈ ఏడాది ఫిబ్రవరిలో అల్ బదర్ ముజాహిదీన్ మాజీ కమాండర్ సయ్యద్ ఖాలిద్ రజాను కరాచీలో గుర్తుతెలియని వ్యక్తులు చంపేశారు. ఇక, ఇస్లామిక్ స్టేట్ టాప్ కమాండర్ అయిజాన్ అహ్మద్ అహంగర్ ఈ ఏడాది ఆరంభంలో అఫ్గాన్‌లో అనుమానాస్పద రీతిలో మరణించాడు.
ఉగ్రవాదుల హత్యల వెనక భారత నిఘా సంస్థ రా హస్తముందని .. దాయాది దేశం పాక్ ఆరోపిస్తోంది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రా .. కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయని చెబుతోంది. దీంతో తమ దేశాల్లో ఉన్న ఉగ్రవాదులను.. రా ఏజెంట్లు టార్గెట్ చేసి హత్య చేస్తున్నాంటోంది. నేరుగా కాకున్నా, తమదేశంలోని కొన్ని గ్రూపుల సాయంతో ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని పాక్ చెబుతోంది. దీని వెనక భారత ప్రభుత్వం ఎన్ఎస్ఏ సలహాదారు దోవల్ స్కెచ్ ఉందన్నది పాకిస్తాన్ ఆరోపణగా తెలుస్తోంది. అయితే.. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని భారత దౌత్యవర్గాలు దీన్ని తోసిపుచ్చుతున్నాయి.













