Iran: ఇరాన్ కు మోడీ ఫోన్, అసలేం జరిగింది..?
మిడిల్ ఈస్ట్ లో యుద్ధం ప్రభావంతో.. ఇప్పుడు చమురు రవాణా అనేది పెద్ద సమస్యగా మారింది. క్రమంగా పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న వేళ, అత్యంత ప్రమాదకరమైన మార్గంగా చెప్తున్న, హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా చిక్కుకున్న రెండు భారత వాణిజ్య నౌకలను సురక్షితంగా రక్షించిన తీరు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) రంగంలోకి దిగి, దౌత్యపరమైన వ్యూహంతో ఈ ఆపరేషన్ను విజయవంతం చేశారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చిన తరుణంలో, ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే ఏ నౌకపైనైనా దాడులు జరిగే అవకాశం ఉన్న స్థితిలో, రెండు భారతీయ నౌకలు అక్కడ చిక్కుకుపోయాయి. పరిస్థితి తీవ్రతను గమనించిన భారత విదేశాంగ శాఖ వెంటనే రంగంలోకి దిగింది. భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA), విదేశాంగ మంత్రి జైశంకర్.. ఇరాన్, ఇతర గల్ఫ్ దేశాల ప్రతినిధులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ రావడంతో ఇరాన్ సహకరించినట్లు తెలుస్తోంది.
ఇరు పక్షాల మధ్య మొత్తం నాలుగు రౌండ్ల కీలక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. భారత నౌకలకు ఎటువంటి హాని కలగకూడదని, వాటికి సురక్షిత మార్గాన్ని కల్పించాలని భారత్ గట్టిగా కోరింది. దౌత్యస్థాయి చర్చలు ఒక కొలిక్కి రాని సమయంలో, స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. ఇరాన్ అగ్రనేతలతో ఆయన నేరుగా మాట్లాడినట్లు సమాచారం. భారత్ కు ఇరాన్ తో ఉన్న చారిత్రక మరియు స్నేహపూర్వక సంబంధాలను ఆయన గుర్తు చేశారు. యుద్ధంతో సంబంధం లేని వాణిజ్య నౌకలు, భారత సిబ్బంది భద్రతపై ఆయన హామీ కోరారు. ప్రధాని విజ్ఞప్తికి ఇరాన్ సానుకూలంగా స్పందించింది.
ప్రధాని చొరవతో, ఇరాన్ మిలిటరీ (IRGC) ఆ రెండు భారతీయ నౌకలకు ఎటువంటి ఆటంకం కలిగించకుండా పచ్చజెండా ఊపింది. భారత నౌకలు హార్ముజ్ జలసంధిని దాటే వరకు భారత నావికాదళానికి చెందిన యుద్ధనౌకలు (Indian Navy Warships) వాటికి రక్షణగా నిలిచాయి. చివరకు ఆ రెండు నౌకలు అత్యంత ప్రమాదకరమైన ‘రెడ్ జోన్’ను దాటి సురక్షిత ప్రాంతానికి చేరుకున్నాయి. ప్రపంచంలోని అగ్రరాజ్యాలు కూడా తమ నౌకలను కాపాడుకోవడానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో, భారత్ తనకున్న దౌత్య బలంతో నౌకలను రక్షించుకోవడం విశేషం.








