రాజకీయాలకు సోనియా గుడ్ బై..! ప్లీనరీలో కీలక వ్యాఖ్యలు..!!
“భారత్ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్ కు ముగింపు పలుకుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది దేశాన్ని మలుపు తిప్పిన యాత్ర. సామరస్యం, సహనం, సమానత్వాన్ని దేశప్రజలంతా కోరుకుంటున్నారని ఈ యాత్ర రుజువు చేసింది.” అంటూ సోనియా గాంధీ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఛత్తీస్ గఢ్ రాజదాని రాయ్‌పూర్‌లో జరుపుతున్న కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో సోనియా ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అంటే నెహ్రూ కుటుంబమే అనే పేరుంది. అలాంటి సమయంలో రాజీవ్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీ అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. పీవీ నరసింహారావు పార్టీని గాడిన పెట్టేందుకు ప్రయత్నించినా పూర్తిగా సఫలం కాలేకపోయారు. చివరకు కాంగ్రెస్ నేతలంతా సోనియా గాంధీని ఆశ్రయించి నువ్వే దిక్కని వేడుకున్నారు. దీంతో అయిష్టంగానే 1998 మార్చి 14న కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టింది సోనియా గాంధీ. ఆమె సారథ్యంలోనే 2004, 2009 ఎన్నికలకు వెళ్లింది పార్టీ. రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మన్మోహన్ సింగ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆ తర్వాత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై బీజేపీ ఘన విజయం సాధించింది. అప్పటి నుంచి ఆ పార్టీకి కష్టాలు మొదలయ్యాయి. ఒకప్పుడు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ.. చివరకు కంచుకోటల్లాంటి రాష్ట్రాల్లోనూ ఓటవి చవిచూసింది. పార్టీలోనూ అంతర్గతంగా విభేదాలు మొదలయ్యాయి. దీంతో 2017లో కాంగ్రెస్ పార్టీ పగ్గాలను కుమారుడు రాహుల్ గాంధీకి అప్పగించింది సోనియా. అయితే రాహుల్ రెండేళ్లకే చేతులెత్తేశారు. పార్టీ పగ్గాలు చేపట్టేందుకు పార్టీ నేతలెవరూ కూడా ముందుకు రాలేదు. దీంతో మళ్లీ 2019లో పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు సోనియా. గతేడాది మల్లికార్జున ఖర్గే ఎన్నికయ్యేంత వరకూ సోనియానే పార్టీని నడిపించారు.
అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కష్టకాలం నడుస్తోంది. బీజేపీ దేశవ్యాప్తంగా బలంగా పాతుకుపోయింది. రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఉనికి కష్టంగా మారుతోంది. ఇలాంటి సమయంలో పార్టీని నడపడం అంటే మామూలు విషయం కాదు. అయినా సోనియా నేతృత్వాన్నే కోరుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. 2004, 2009 ఎన్నికల్లో పార్టీ విజయం సాధించింది. ప్రధాన పదవి చేపట్టేందుకు ఆమెకు అన్ని అర్హతలూ ఉన్నాయి. అయినా ఆమె ప్రధాని సీట్లో కూర్చోలేదు. మన్మోహన్ సింగ్ ను కూర్చోబెట్టారు. దీంతో ఆమె మరింత పెద్దరికాన్ని సంపాదించుకున్నారు.
అయితే ఇప్పుడు సోనియా వయసు మీదపడుతోంది. ఆరోగ్యం కూడా పెద్దగా సహకరించటం లేదు. దీంతో కుమారుడు రాహుల్ గాంధీకి కీలక బాధ్యతలు అప్పగించారు సోనియా. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై సోనియా పూర్తి సంతృప్తిగా ఉన్నారు. కచ్చితంగా భవిష్యత్తులో ఈ యాత్ర దేశాన్ని మలుపు తిప్పుతుందని ఆమె బలంగా నమ్ముతున్నారు. అందుకే ఈ సమయంలోనే తన ఇన్నింగ్స్ కు స్వస్తి పలకాలని సోనియా నిర్ణయించుకున్నట్టు అర్థమవుతోంది. బహుశా ఇకపై ఆమె ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చు. రాజకీయాలకు పూర్తిగా దూరం కావచ్చు. పార్టీ బాధ్యతల నుంచి ఇప్పటికే ఆమె పూర్తిగా తప్పుకున్నారు. 2024 ఎన్నికలకు మల్లికార్జున ఖర్గే నేతృత్వం వహిస్తారని సోనియా ప్రకటించారు. ఆ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు.













