హస్తానికి ఏమైంది?
125 ఏళ్ల చారిత్రక నేపథ్యం.. దశాబ్దాల పాటు భారతదేశాన్ని ఏలిన ఘన కీర్తి. ఒక్క కంటి సైగతో ప్రభుత్వాలను శాసించిన రాజసం. అంతటి ఘన చరిత్ర కాంగ్రెస్ సొంతం. అలాంటి కాంగ్రెస్ ఇప్పుడు ఏకంగా నిధులు లేక నీరసిస్తోంది. కాంగ్రెస్‌కు ఒక్క పైసా ఇచ్చేందుకు కూడా కార్పొరేట్ రంగం ముందుకు రావడం లేదు. ఓవైపు సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. అర్థబలం, కండబలం మెండుగా ఉన్న బీజేపీని ఎదుర్కోవాలంటే.. తగినంతగా డబ్బు నిల్వలు కావాలి. కానీ అసలైనవే నిండుకుంటుండడంతో… ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలోని బీజేపీని కాంగ్రెస్ ఎలా ఫేస్ చేయనుంది?
కొన్ని దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన శతాధిక పార్టీ కాంగ్రెస్ నిధుల కొరతను ఎదుర్కొంటోంది. కొద్దినెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల సమరం కోసం నిధులు సమకూర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. అందు కోసం కాంగ్రెస్ త్వరలో క్రౌడ్ ఫండింగ్‌కు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ (ఏడీఆర్) ప్రస్తుత గణాంకాల ప్రకారం.. కాంగ్రెస్ నిధుల విలువ రూ.805.68 కోట్లుగా ఉంది. మరోవైపు బీజేపీ నిధుల విలువ భారీస్థాయిలో రూ 6,046.81 కోట్లుగా ఉంది. గత ఏడు సంవత్సరాల్లో హస్తం పార్టీకి అందుతోన్న విరాళాలు తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో బీజేపీకి ప్రకటించిన కార్పొరేట్ విరాళాల మొత్తం.. అన్ని జాతీయ పార్టీలకు అందిన విరాళాల కంటే మూడు రెట్లు ఎక్కువ. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఆ మొత్తం 18 రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.
అయితే.. విపక్ష పార్టీలకు ఫండింగ్ చేసే కంపెనీలు,వ్యాపార వేత్తల ఆఫీసులు, కార్యాలయాలపై … దర్యాప్తు సంస్థల సాయంతో బీజేపీదాడులు చేయిస్తోందని ఇప్పటికే కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీంతో విపక్షాలకు ఫండింగ్ చేసి, ఇబ్బందులు ఎందుకు ఎదుర్కోవాలన్న భయంతోనే..కంపెనీలు ఫండింగ్ చేసేందుకు ముందుకురావడం లేదంటున్నారు కాంగ్రెస్ నేతలు..వివిధరాష్ట్రాల్లోని కాంగ్రెస్ సానుభూతి పరుల ఆస్తులపై ఐటీ, ఈడీ, సీబీఐ దాడులను ఉదాహరణగా ప్రస్తావిస్తున్నారు.అందుకే క్రమంగా తమ పార్టీకి ఫండింగ్ తగ్గుతోందని చెబుతున్నారు.
ఇక ఆన్లైన్ విరాళాల సేకరణ విషయంలో కాంగ్రెస్.. ఆమ్ ఆద్మీ పార్టీ బాటలో వెళ్లాలనుకుంటోంది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు కూడా నిధుల కొరత ఎదురుకావడంతో ఈ దారినే అనుసరించింది. ఆ ఎన్నికల్లో 545 లోక్‌సభ సీట్లకు గానూ 52 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. ప్రధాని మోడీ నేతృత్వంలోని భాజపా 303 సీట్లతో భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావించే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాలకు నవంబర్‌లో ఎన్నికలు జరగనుండగా..డిసెంబర్ మూడున ఫలితాలు వెల్లడికానున్నాయి. వీటి తర్వాత కాంగ్రెస్ క్రౌడ్ ఫండింగ్ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.













