కరోనా కట్టడికి గవర్నర్లకు సూచనలు చేసిన ప్రధాని మోదీ
దేశంలో అన్ని ప్రాంతాలకూ సరిపడా వ్యాక్సిన్లను అందజేసే ప్రక్రియకు తాము కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. కోవిడ్ నియంత్రణకు సమాజంలోని అన్ని గ్రూపులు కలిసి సమిష్టిగా పోరాడాలని, వారిని వినియోగించుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. కరోనా నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా పాల్గొన్నారు. కోవిడ్ వెన్ను విరియడంలో ప్రజల భాగస్వామ్యమే ముఖ్యమని మోదీ నొక్కి వక్కానించారు. ప్రజల భాగస్వామ్యాన్ని రోజు రోజుకీ ప్రోత్సహించాలని సూచించారు. ఇలా ప్రోత్సహించడంలో గవర్నర్ల పాత్ర చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు. 10 కోట్ల టీకాల మైలురాయిని భారత్ చేరుకుందని, అత్యంత వేగవంతమైన వ్యాక్సినేషన్ దేశంగా భారత్ ఎదిగిందని సంతృప్తి వ్యక్తం చేశారు.
కరోనా వ్యాక్సినేషన్, వైద్య విధానాల సమాచారాన్ని అందరికీ తెలియజేయాలని సూచించారు. ఆయుష్ ఔషధాల గురించి కూడా ప్రజలకు వివరించాలని అన్నారు. రాజకీయ పార్టీల మధ్య వున్న భేదభావాలన్నీ పక్కనపెట్టి, కరోనాపై యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ‘టీకోత్సవ్’ దేశంపై సానుకూల ప్రభావాన్నే చూపుతోందని, టీకా డ్రైవ్ కూడా విస్తరించిందని పేర్కొన్నారు. కొత్త టీకా కేంద్రాలు కూడా కొన్ని ప్రాంతాల్లో వచ్చాయన్నారు. కరోనా నియంత్రణ కోసం సామాజిక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి వచ్చేలాగా గవర్నర్లు జోక్యం చేసుకోవాలని, కోవిడ్ నియంత్రణలో వారిద్దరూ కలిసి పనిచేసేలా చూసే బాధ్యతను గవర్నర్లు తీసుకోవాలని కోరారు. ఇలా ఓ నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటే అంబులెన్స్‌లు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ల కొరత లేకుండా ఈ నెట్వర్క్ సహాయ పడుతుందని మోదీ వివరించారు. కరోనా కేసులు కనిపించిన ప్రాంతాలల్లో మైక్రో కంటైన్మెంట్ విధానాలను అవలంబించేలా చూడాలని సూచనలు చేశారు. గతేడాది లాగే వ్యాక్సిన్ పంపిణీలో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ సంస్థలు ప్రధాన పాత్ర తీసుకోవాలని అభిలషించారు.
కలిసి పనిచేద్దాం.. విభేదాలు మరిచిపోదాం : వెంకయ్య
కరోనా నియంత్రణలో రాజకీయ వైరుధ్యాలు పక్కనపెట్టి, రాజకీయ పక్షాలన్నీ భుజం భుజం కలపాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. గతంలో అందరమూ కలిసి కట్టుగా ఉండటం వల్లే కరోనాను కట్టడి చేయగలిగామని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కోవిడ్ వ్యూహాన్ని కేంద్రం సిద్ధంచేసి, అమలు చేసిందని పేర్కొన్నారు. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి, ఐకమత్యంగా పనిచేయాలని కేంద్రం పిలుపునిచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్ర అధినేతగా కోవిడ్ వ్యతిరేక పోరాటంలో గవర్నర్ల పాత్ర చాలా ఉందన్నారు. ముఖ్యమంత్రులతో కలిసి చురుకుగా పనిచేస్తూ, కోవిడ్ కట్టడికి సహకరించాలని, ఏకాభిప్రాయ బిల్డర్లుగా గవర్నర్లు పాత్ర పోషించాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.













