ఇదోరకం తీర్పు… భార్యే భర్తకు భరణం చెల్లించాలని ఆదేశం
కాలం వింత వార్తలను మోసుకొస్తుంది. బండ్లు ఓడలు కావడం… ఓడలు బండ్లు కావడమంటే ఇదేనేమో. ఎక్కడైనా భార్యా భర్తలు విడిపోతే భార్యకు భర్త భరణం ఇవ్వాలని తీర్పునివ్వడం చూశాం. దాదాపుగా జరిగే సంఘటనలు కూడా ఇవే. కానీ యూపీలోని ఓ ప్రాంతంలో మాత్రం తద్భిన్నంగా జరిగింది. భార్యే భర్తకు భరణం ఇవ్వాల్సి వచ్చింది. అవును… ఇది జరిగింది. ముజఫర్ నగర్లోని ఖతౌలీ పట్టణంలో ఈ విచిత్ర సంఘటన జరిగింది. ఓ కేసులో భార్య భర్తకు భరణం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఖతౌలీలో 62 ఏళ్ల ఓ వ్యక్తి టీ స్టాల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన భార్య అతని నుండి 2013 లో విడాకులు తీసుకుంది. ఆమె ప్రభుత్వోద్యోగి విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందారు. తన భార్యతో తనతో కలిసి ఉండేలా చూడాలంటూ ఆ వ్యక్తి ఫ్యామిలీ కోర్టుకు విన్నవించుకున్నాడు.
అయితే ఆ స్త్రీ తనతో కలిసి జీవించడానికి విముఖత వ్యక్తం చేసింది. దీంతో ఆ వ్యక్తి ఆమె నుంచి నిర్వహణ భత్యం కోరుతూ 1955 హిందూ వివాహ చట్టం ప్రకారం మరోమారు పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో ఆ వ్యక్తికి భరణం చెల్లించాలని ఆ స్త్రీని ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది. ఆ వ్యక్తికి ఎలాంటి ఆదాయ వనరులు లేదని, అందుకే 12 వేల రూపాయల పెన్షన్లో 1000 రూపాయలు ఆ వ్యక్తికి చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు.













