కీలకమైన సవాళ్లపై.. రెండు దేశాలు భాగస్వామ్యం : ఆస్టిన్
ఇండో పసిఫిక్ ప్రాంతంలో సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్, అమెరికా దేశాల భాగస్వామ్యాన్ని అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ ఆస్టిన్ ప్రశంసించారు. ఆస్టిన్ భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌తో సమావేశమయ్యారు. అనంతరం సమావేశానికి సంబంధించిన విషయాన్ని ట్విటర్లో వెల్లడించారు. భారతీయ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌తో గొప్ప సమావేశం జరిగింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో కీలకమైన సవాళ్లపై రెండు దేశాలు పరస్పర సహకారంతో పనిచేస్తున్నాయి. ఈ సహకారమే రెండు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యం ప్రాధాన్యతను తెలియజేస్తోంది అని ఆస్టిన్ ట్వీట్లో తెలిపారు.
మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ ఆస్టిన్ భారత్‌కు వచ్చారు. ఇందులో భాగంగా ఆయన ముందుగా భారత ప్రధాని మోదీతో సమావేశయ్యారు. ఆస్టిన్‌తో మోదీ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావాల్సిన ఆవశ్యకతను తెలిపారు. అంతేకాకుండా అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్‌కు శుభాకాంక్షలు తెలియజేయమన్నారు.













