ఎన్నికల సిరా చుక్క చరిత్ర మీకు తెలుసా?

ఎన్నికల్లో మనం మనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తాం. ఎన్నికలు అన్న వెంటనే మనలో చాలామందికి మొదట గుర్తుకు వచ్చేది వేలి మీద వేసే సిరా చుక్క. ఎందుకంటే మనం ఓటు వేసాము అని చెప్పడానికి ఇదే రాజముద్ర కాబట్టి. ఓటు వేసిన తర్వాత చాలామంది తమ వేలి మీద ఉన్న సిరా చుక్కని చూపిస్తూ సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో పెడుతున్నారు.ఎన్నికల్లో ఓటరు తన ఓటుహక్కు వినియోగించుకున్నాడు అనేదానికి నిదర్శనంగా.. బోగస్, రీసైక్లింగ్ ఓటు అరికట్టడానికి ఈ సిరా చుక్క ను ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. ఒక్కసారి సిరాచుక్క వేల మీద వేసిన తర్వాత సుమారు 72 గంటల పాటు ఇది చెరిగిపోదు. దీంతో దొంగ ఓట్లను చాలా వరకు అరికట్టవచ్చు.
ఇంతకీ ఈ సిరా చుక్క ఎక్కడ తయారవుతుంది.. ఎప్పటినుంచి దీని వాడుతున్నారు అన్న విషయం మీకు తెలుసా? కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ కు చెందిన మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ సంస్థ మన ఎన్నికల్లో వాడే సిరా చుక్కను తయారు చేస్తుంది. సిరా ఉత్పత్తి కోసం మన కేంద్ర ప్రభుత్వం 1962లో ఈ కంపెనీకి అనుమతిచ్చింది.నేషనల్ ఫిజికల్ ల్యాబరేటరీస్ వారు డెవలప్ చేసిన ఫార్ములాతో ఈ సిరా తయారీ బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఈ కంపెనీకి అప్పగించింది. అప్పటినుంచి ఇప్పటివరకు మనదేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా.. ఉపయోగించే సిరా సరఫరా ఈ కంపెనీ నుంచే జరుగుతుంది.
ఎన్నికల సంఘంలోని నిబంధన 37(1) ప్రకారం..పోలింగ్ అధికారి ఓటు వేసిన వ్యక్తి ఎడమ చేయి చూపుడు వేలు పై సిరా గుర్తును పరిశీలించాల్సి ఉంటుంది. ఒకవేళ ఓటర్ కు పొరపాటున ఎడమ చేతి చూపుడు వేలు లేకపోతే.. వేరొక వేలికి సిరా చుక్క పెట్టవచ్చు.ఈ సిరా లో 7.25 శాతం సిల్వర్ నైట్రేట్ ఉండడంతో ఇది అంత సులభంగా చెరిగిపోదు.ఈ సిరాను మన దేశంలోని అన్ని రాష్ట్రాల ఎన్నికల సమయంలో సరఫరా చేయడంతో పాటు 29 దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. 2006 ఫిబ్రవరి 1 నుంచి ఎన్నికల సమయంలో ఈ సిరా పెట్టే విధానంను కొద్దిగా మార్చారు. ఓటరు ఎడమ చేతి చూపుడు వేలు గోరు పైభాగం నుంచి కింద వరకు ఈ సిరా గుర్తు పెడుతున్నారు.