US-India Trade Deal: అమెరికా ట్రేడ్ డీల్‌తో వ్యవసాయానికి ఢోకా లేదన్న కేంద్రం
భారత్-అమెరికా మధ్య కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై (US-India Trade Deal) పార్లమెంట్లో తీవ్ర దుమారం రేగింది. బుధవారం లోక్‌సభలో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈ ఒప్పందంపై వివరణ ఇస్తూ వ్యవసాయం, డెయిరీ వంటి సున్నితమైన రంగాల ప్రయోజనాలకు ఇందులో పూర్తి రక్షణ కల్పించినట్లు స్పష్టం చేశారు. నెలల తరబడి జరిగిన చర్చల అనంతరం, ఇరు దేశాల ఆమోదంతోనే ఈ డీల్ ఖరారైందని ఆయన తెలిపారు.
మంత్రి ప్రకటన చేస్తున్న సమయంలోనే రాహుల్ గాంధీ నేతృత్వంలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. అదానీ వ్యవహారం, ఎప్స్టీన్ ఫైల్స్ ఒత్తిడి వల్లే ప్రధాని మోదీ దేశాన్ని తాకట్టు పెడుతూ ఈ ఒప్పందం (US-India Trade Deal) చేసుకున్నారని రాహుల్ (Rahul Gandhi) తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే సస్పెండ్ చేసిన ఎంపీలపై సస్పెన్షన్లను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ గందరగోళం నడుమ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని (PM Modi) ఇవ్వాల్సిన ప్రసంగం వాయిదా పడింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ ఒప్పందం (US-India Trade Deal) గురించి భారత పార్లమెంట్‌కు తెలియజేయక ముందే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ద్వారా విషయం బయటకు రావడం పార్లమెంటరీ వ్యవస్థకే అవమానమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే చర్యేనని రాజ్యసభలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.






