ఏపీలో ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ పేరిట ఆలయం..!
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) మాతృమూర్తి స్వర్గీయ హీరాబెన్ మోదీ పేరిట ఆంధ్రప్రదేశ్లో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని గుడికల్ గ్రామంలో ఈ ఆలయాన్ని నిర్మించేందుకు ‘మాతా శ్రీ మందిరం ఛారిటబుల్ సొసైటీ’ సభ్యులు నడుం బిగించారు. సోమవారం గ్రామంలో నిర్వహించిన ఈ ఆలయ నిర్మాణ భూమిపూజ కార్యక్రమంలో ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొని పనులను లాంఛనంగా ప్రారంభించారు.
మాతృమూర్తి విలువలను, త్యాగాలను సమాజానికి చాటిచెప్పే ఉద్దేశంతో ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ పేరు మీద ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు ‘మాతా శ్రీ మందిరం ఛారిటబుల్ సొసైటీ’ నిర్వాహకులు తెలిపారు. ఈ భూమిపూజ కార్యక్రమంలో బీజేపీ నాయకులతో పాటు జనసేన, వైసీపీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం. రాజకీయాలకు అతీతంగా మాతృమూర్తి గౌరవార్థం చేపట్టిన ఈ కార్యక్రమం స్థానికంగా ఆసక్తికర చర్చకు దారితీసింది.
ఇవి కూడా చదవండి
దేశంలో అత్యున్నత పదవిలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీని ఒక సామాన్య స్థాయి నుంచి దేశ నాయకుడిగా తీర్చిదిద్దడంలో హీరాబెన్ పాత్ర ఎంతో గొప్పదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి కొనియాడారు. తల్లి పట్ల ప్రధాని మోదీకి ఉన్న భక్తిప్రపత్తులు ప్రతి ఒక్కరికీ ఆదర్శమని, అలాంటి మాతృమూర్తి పేరిట కర్నూలు జిల్లాలో ఆలయం నిర్మించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ఆలయ నిర్మాణ పనులను పూర్తి చేసి భక్తులకు, సందర్శకులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సొసైటీ సభ్యులు వెల్లడించారు.







