Sunetra Pawar: మహారాష్ట్ర తొలి మహిళా డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్!
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర చరిత్రలోనే తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా దివంగత నేత అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ (Sunetra Pawar) రికార్డు సృష్టించారు. శనివారం ముంబైలోని లోక్‌భవన్‌లో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎన్సీపీ కార్యకర్తలు భావోద్వేగానికి లోనయ్యారు. “అజిత్ దాదా అమర్ రహే”, “వదిన గారు ముందుకు సాగండి.. మేము మీతోనే ఉన్నాం” అంటూ నినాదాలతో ప్రాంగణాన్ని హోరెత్తించారు. అంతకుముందే ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా ఆమెను (Sunetra Pawar) పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అజిత్ పవార్ నిర్వహించిన శాఖలే ఆమెకు దక్కే అవకాశం ఉండగా, ఆర్థిక శాఖను మాత్రం సీఎం ఫడ్నవీస్ పర్యవేక్షించనున్నట్లు సమాచారం.
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ‘ఎక్స్’ వేదికగా సునేత్ర (Sunetra Pawar) ప్రమాణ స్వీకారంపై స్పందించారు. అజిత్ పవార్ కలలను సునేత్ర సాకారం చేస్తారని, ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న సునేత్ర.. త్వరలో బారామతి అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసే అవకాశం ఉంది. కాగా, ఈ వేడుక గురించి తనకు కనీస సమాచారం లేదని ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ పేర్కొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.






