సుప్రీంకోర్టులో అరుదైన సన్నివేశం
భారత సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) లో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనంలో సింగపూర్ చీఫ్ జస్టిస్ సుందరేశ్ మేనన్ భాగస్వామి అయ్యారు. సింగపూర్ నాలుగో ప్రధాన న్యాయమూర్తిగా 2012లో బాధ్యతలు చేపట్టిన మేనన్ ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్నారు. భారత సుప్రీంకోర్టు 73వ వార్షికోత్సవాల్లో పాల్గొనేందుకు భారత్కు చేరుకున్నారు. రేపు సుప్రీంకోర్టులో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మారుతోన్న ప్రపంచంలో న్యాయవ్యవస్థ పాత్ర అంశంపై జస్టిస్ సుందరేశ్ మేనన్ ప్రసంగించనున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులతో సింగపూర్ సీజే చర్చలు జరపనున్నారు. రెండు న్యాయవ్యవస్థల మధ్య మరింత సహకారం, న్యాయ విద్య, జ్ఞానాన్ని పంచుకునే అవకాశాల గురించి చర్చించే అవకాశం ఉందని సుప్రీంకోర్టు ఓ ప్రకటనలో తెలిపింది.













