పరూంఖ్ గ్రామం కాదు… నా మాతృభూమి : రాష్ట్రపతి కోవింద్

ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్నది నానుడి. అంటే… కొడుకు ఎంత ఎత్తు ఎదిగినా… తల్లికి మాత్రం కొడుకే. సొంత గ్రామం విషయంలోనూ ఇదే తంతు. ఎంత ఎదిగి, పెద్ద పెద్ద సిటీల్లో ఉన్నా, సొంత గ్రామానికి వెళితే, ఆ పొంగు వచ్చేస్తుంది. ఆ మురిపెం వేరుగా ఉంటుంది. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ విషయంలో అచ్చు ఇదే జరిగింది. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాంనాథ్ కోవింద్ తొలిసారిగా ఆయన స్వగ్రామానికి వెళ్లారు. యూపీలోని కాన్పూర్ జిల్లా పరుంఖ్ గ్రామ సమీపంలో ఆయన హెలిప్యాడ్ కోసం ఏర్పాట్లు చేశారు. దిగీ దిగగానే ఆయన తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. నేలను ఓసారి ముద్దాడారు. నేలకు చేతులను ఆనించి, వినమ్రతతో నమస్కరించారు. కొంత మట్టిని తీసుకొని, నుదుటికి తాకించి, బొట్టు కూడా పెట్టుకున్నారు. ఆ తర్వాత స్థానిక దేవాలయంలో పూజలు చేశారు. రాష్ట్రపతి హోదాలో పరౌంఖ్ గ్రామానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ ఆనంది బెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి, ఇతర అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోవింద్ మాట్లాడుతూ… ‘‘ నా లాంటి సాధారణ గ్రామ బాలుడికి దేశ అత్యున్నత పదవి లభిస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. నా గ్రామ ప్రజలకు ధన్యవాదాలు ప్రకటిస్తున్నా. పరుంఖ్ కేవలం గ్రామం మాత్రమే కాదు.. నాకు మాతృభూమి’’ అని కోవింద్ పేర్కొన్నారు.