ఒడిషాలో బీజేపీ-బీజేడీ పొత్తు లేనట్లే!
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సాధ్యమైనన్ని పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు అధికార, ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార బీజేపీ తమ ఎన్డీఏ కూటమిలో రాష్ట్రాల వారీగా అనేక ప్రాంతీయ పార్టీలను కలుపుకుంటూ ముందడుగు వేస్తోంది. అందులో భాగంగానే ఒడిషాలోని నవీన్ పట్నాయక్ పార్టీ బిజుజనతాదళ్ పార్టీతో కూడా పొత్తు కోసం ప్రయత్నించింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇరు పార్టీల మధ్య చర్చలు విఫలమయ్యాయి. తాజాగా బీజేపీ అధిష్ఠానం చేసిన ప్రకటనతో ఈ విషయం స్పష్టమైంది.
రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేడీతో పొత్తు కోసం బీజేపీ ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శుక్రవారం ఇరు పార్టీల మధ్య చర్చలు కూడా జరిగాయి. కానీ సదరు చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఇరు పార్టీలు వేరు వేరుగానే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు స్పష్టం చేశాయి. చర్చల అనంతనం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేడీతో పొత్తుపై ఏకాభిప్రాయం కుదరలేదని, అందువల్ల రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని, 147 అసెంబ్లీ స్థానాలతో పాటు 21 లోక్‌సభ స్థానాల్లోనూ తమ అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు.
పార్టీలతో పొత్తులు పెట్టుకోవడంపై ఒడిషా సీఎం, బిజు జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ గతంలోనే తన వైఖరిని స్పష్టం చేశారు. తమ పార్టీ అటు బీజేపీతో కానీ, ఇటు కాంగ్రెస్‌తో కానీ ఎలాంటి పొత్తు పెట్టుకోబోమని, ఇరు పార్టీలకు సమాన దూరంలో ఉంటామని ప్రకటించారు. తన ప్రకటనకు తగ్గట్లుగానే 2009, 2014, 2019లలో ఒడిషాలో ఒంటరిగానే పోటీ చేసి అద్భుత విజయాలు సాధించారు.
అయితే 2014లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నవీన్ పట్నాయక్ పార్టీ లోపాయికారీగా మద్దతిస్తూ వస్తోంది. పార్లమెంటులో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకూ మద్దతు కూడా ఇస్తోంది. దీనికి బదులుగా కేంద్రం కూడా ఒడిషాకు అందాల్సిన నిధులు, పథకాల్లో ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా సహకరిస్తోంది.
ఇదిలా ఉంటే ఇప్పటికే 5 సార్లు ఒడిషా ముఖ్యమంత్రిగా ఎన్నికైన నవీన్ పట్నాయక్.. ఈ సారి కూడా అధికారం చేపట్టి ఆరోసారి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాలని నవీన్ పట్నాయక్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దానికి అనుగుణంగానే కేంద్ర నాయకత్వంతో చేతులు కలిపితే రాష్ట్రానికి మరింత లబ్ధి చేకూరుతుందని, రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని మరింత వేగంగా పరుగులు తీయించవచ్చని అంచనాకొచ్చిన ఆయన ఎన్డీఏతో పొత్తు కోసం ఆసక్తి కూడా చూపించారు. అదే సమయంలో 2024 లోక్‌సభలో ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ద్వారా ఎలాగైనా 400లకు పైగా సీట్లు సాధించాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీ కూడా నవీన్‌తో పొత్తుపై ఆసక్తి చూపించింది. తాజాగా దీనిపై ఇరు పార్టీల మధ్య సుదీర్ఘ మంతనాల అనంతరం చర్చలు విఫలమైనట్లు బీజేపీ నాయకత్వంప్రకటించింది.













