అనుకున్నది సాధించిన క్షమాబిందు… తనను తానే
తనను తానే పెళ్లి చేసుకుంటానంటూ ప్రకటించిన గుజరాతీ యువతి క్షమాబిందు అన్నంతపనీ చేసింది. ఘనంగా, సంప్రదాయ బద్దంగా వివాహం చేసుకుంది. దేశంలో తొలి సోలోగమీ ఇదే. వాస్తవానికి ఆమె జూన్ 11న పెళ్లి ముహూర్తం పెట్టుకుంది. కానీ ఆమె వివాహం పెద్ద చర్చ, వివాదానికి దారితీయడంతో దీనికి ముగింపు పలకాలని ఈ నెల 8న వివాహ కార్యక్రమాన్ని తన స్వస్థలం గోత్రిలో ముగించేసింది. కానీ, ప్రకృతి విరుద్ధమైన పెళ్లి జరిపేందుకు ఒక్క పురోహితుడు కూడా ముందుకు రాలేదు. తొలుత ఆలయంలో వివాహ కార్యక్రమం ఉంటుందని క్షమామిందు ప్రకటించినప్పటికీ, ఇంట్లోనే చేసుకుంది.
మెడలో మంగళసూత్రం కూడా ధరించింది. 40 నిమిషాల పాటు పెళ్లి వేడుక కొనసాగింది. పెళ్లి బట్టల కోసం తానే స్వయంగా షాపింగ్ చేసింది. ఒక్క పురోహితుడు, వరుడు లేని లోటు కనిపించింది తప్ప మిగతాదంతా సేమ్ టు సేమ్ అచ్చమైన పెళ్లే మాదిరే నడిచింది. ఇతర వధువుల్లా తాను పెళ్లి తర్వాత ఇంటిని విడిచి వెళ్లాలని అనుకోవడం లేదని క్షమాబిందు చెప్పింది.హిందూ మతంలో ఒకరు తనను తానే పెళ్లి చేసుకోవడం కుదరని, ఈ వివాహాన్ని ఆలయంలో జరగనీయబోమని స్థానిక బీజేపీ నేత సునీతా శుక్లా సైతం హెచ్చరించడం గమనార్హం.













