భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేసిన జస్టిస్ ఎన్వీ రమణ
భారత అత్యున్నత న్యాయస్థానం 48వ ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు తేజం జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం ఉదయం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. 48వ సీజేగా జస్టిస్ రమణ ఆగస్టు 26, 2022 వరకూ పదవిలో కొనసాగనున్నారు. కోవిడ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి అతి కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, సెక్రెటేరియట్ అధికారులతో పాటు జస్టిస్ రమణ కుటుంబీకులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
భారత ప్రధాన న్యాయమూర్తి పదవిని అలంకరించిన రెండో తెలుగు వ్యక్తిగా జస్టిస్ రమణ చరిత్ర సృష్టించారు. 2014 ఫిబ్రవరి 17న జస్టిస్ రమణ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఆయన ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా సేవలు అందించారు.
1957 ఆగస్టు 27న కృష్ణాజిల్లా పొన్నవరం గ్రామంలోని ఓ సాధారణ వ్యవసాయ కుటుంబంలో జస్టిస్ రమణ జన్మించారు. 1983 ఫిబ్రవరి 10న అడ్వకేట్‌గా ప్రస్థానం మొదలుపెట్టారు. ఆంధప్రదేశ్ హైకోర్టు, సెంట్రల్, ఆంధ్ర ప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునళ్లతో పాటు సుప్రీంకోర్టులో సివిల్, క్రిమినల్, రాజ్యాంగ, కార్మిక, సేవా, ఎన్నికల వ్యవహారాల్లో ప్రాక్టీస్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ అదనపు అడ్వకేట్ జనరల్‌గా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. 2000 జూన్ 27న ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2003 మార్చి 10 నుంచి 2013 మే 20 వరకు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ రమణ పనిచేశారు.













