తెలుగు భాష మరుగునపడకుండా కాపాడాలి
ప్రస్తుతం తెలుగు భాషకు గతంలో ఎన్నడూ లేనంత తీవ్రమైన ముప్పు పొంచి ఉందని, దాన్ని కాపాడుకోవడానికి భాషాభిమానులందరూ ఉద్యమస్థాయిలో పూనుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా దక్షిణాఫ్రికా తెలుగు సంఘం, నార్వేకు చెందిన వీధి అరుగు సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రపంచంలో ఏ మూలనో స్థిరపడినా మాతృభాష తెలుగును పరిక్షించుకునేందుకు పాటుపడుతున్న నిర్వాహకులను ఆయన ప్రశంసించారు. తెలుగు భాషను ప్రోత్సహించడానికి వారు చేస్తున్న కృషి, చూపిస్తున్న ఉత్సాహం బహుశా తెలుగు రాష్ట్రాల్లో కూడా కనిపించదేమోనని ఎన్వీ రమణ అన్నారు. తాజా జనాభా లెక్కల ప్రకారం నేడు భారత దేశంలో 8.10 కోట్ల మందికి పైగా తెలుగు మాట్లాడేవారున్నారని, సంఖ్యాపరంగా చూస్తే తెలుగు మాట్లాడెవారు దేశంలో 3వ స్థానంలో, ప్రపంచంలో 13వ స్థానంలో ఉన్నారని అంచనాలున్నాయని ఆయన తెలిపారు. క్రీస్తు పూర్వం 400 సంవత్సరం నుంచి ఉనికిలో ఉన్న తెలుగు భాష ఒక ఉద్యమ రూపం దాల్చడానికి ఒకానొక కారణం మహాభారతాన్ని కవిత్రయం నన్నయ్య, తిక్కన, ఎరాప్రగడ తెనుగించడమే అని వ్యాఖ్యానించారు. తెలుగు భాష- పురాణాలు, ఇతిహాసాలు, ప్రబంధాలను దాటి సమయాను కూలంగా ప్రజల భాషను పరిణతి చెందుతూ నవల, కథానికి, గేయం, పద్యం, జానపదం, కవితారూపాల్లో విరాజిల్లుతోందని అన్నారు.
భాష సంస్క•తి ఒకదానికొకటి పెనవేసుకుని ఉంటాయని, సమాజం మార్పు కోరుతున్నపుడు, తగిన సర్దుబాట్లు చేసుకోకపోతే, సమాజంతో పాటు భాషకూ, సంస్క•తికీ తిప్పులు తప్పవని అన్నారు. కాలానుగుణంగా భాషలో మార్పు రాకపోతే, ఆ భాష ఆ సంస్కృతి పతనమైన ఘటనలు ఎన్నో ఉన్నాయని వెల్లడించారు. సంక్లిష్ట రచనా పక్రియల నుంచి సరళమైన పక్రియలకు మన ప్రస్థానం సాగిందని గుర్తు చేశారు. ఈ ప్రస్థానంలో ముందు చూపుతో తగు మార్పులతో భాషను ప్రగతిశీలంగా మలిచిన యుగపురుషుల్లో గిడుగు వేంకట రామూర్తి పంతులు అగ్రగణ్యులని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు, గిడుగు రామ్మూర్తి త్రయం, సాహితీ సామాజిక సంస్కరణలతో తెలుగు భాషను సామాన్య ప్రజల భాషగా మలిచారని అన్నారు. వాడుక భాషా ఉద్యమం అప్పుడప్పుడే ఒక రూపుదిద్దుకుంటున్న స్వాతంత్య్ర పోరాటానికి సైతం ఊపునిచ్చిందని గుర్తు చేశారు. ఒక మనిషితో అతడికి అర్థమయ్యే భాషలో మాట్లాడితే అతడి తలకి మాత్రమే ఎక్కుతుంది. అతడి సొంత భాషలో మాట్లాడితే అతడి హృదయాన్ని స్పశిస్తుంది. అన్న నెల్సన్ మండేలా వ్యాఖ్యలను భారత ప్రధాన న్యాయమూర్తి గుర్తు చేశారు.
భాష అనేది స్వాతంత్య్రానికి, స్వేచ్ఛకు సంకేతం. ఇది మానవ సంబంధాలకు ఆధారం, భావాలకు దర్పణం. ప్రపంచ వ్యాప్తంగా విముక్తి కోసం సాగిన ప్రతి ఉద్యమానికి మాధ్యమం మాతృభాషే. భారత స్వాతంత్య్ర పోరాటంలో కూడా విభిన్న ప్రాంతాల్లో, విభిన్న స్థానిక భాషలు, ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించాయి. ఆ దశలో ప్రగతి శీల కవులు, రచయితలు ఎన్నోన్నో రచనలు చేసి తెలుగు ప్రజలను తెలుగు జాతిని స్వాతంత్య్ర ఉద్యమానికి తిరుగులేని శక్తిగా మలిచారు. గరిమెళ్ల సత్యనారాయణ గారి మా కొద్దీ తెల్లదొరతనం, రాయప్రోలు వారి ఏ దేశమేగినా, ఎందు కాలిడినా, చిలకమర్తి వారి భరతఖండంబు చక్కని పాడి యావు. దాశరథి వారి నా తెలంగాణ కోటీ రతనాల వీణ ఇలా ఎన్నెన్నో రచనలు తెలుగు జాతిని ఉర్రూత లూగించాయి. పోరాటానికే ప్రేరేపించాయి అని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. మన భాషకు ఎంతో ఘన చరిత ఉన్నా, సంఖ్యాపరంగా ఎంతో ప్రాభవం ఉన్నా, మన అణకువ కారణంగా తగినంత ప్రాముఖ్యత రాలేదన్నారు.
నందమూరి తారక రామారావు అగశ్రేణి సినీనటుడుగా వెలుగొందడం వల్లనే ఆయన సులువుగా అధికారంలోకి రాగలిగారని అందులో సందేహం లేదని అన్నారు. తన వ్యక్తిగత అభిప్రాయం కాస్త భిన్నంగా ఉందన్నారు. ఎన్టీఆర్ సినీ ప్రాభవం, స్ఫురద్రూపం, రాజకీయ అనుకూలతలు, చైతన్య రథపు వినూత్న ప్రయోగం ఇవన్నీ ఒకెత్తయితే, ఊరూరా తిరిగి, సరళ మైన సామాన్యుడి భాషలో, ఆనర్గళంగా ప్రసంగించి తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని తట్టిలేపిన ఆయన వాక్చాతుర్యం. ఆయన విజయంఒలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు. 1980వ దశకం ఆరంభం వరకు తెలుగువారిని కూడా మద్రాసీలుగా జమ కట్టేవారని, తెలుగు ఆత్మ గౌరవానికి, భాషకు, సంస్కృతికి ఎన్టీఆర్ ఇచ్చిన ప్రాధాన్యత కారణంగా తెలుగు జాతికి ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు.
ప్రస్తుతం తెలుగు భాషకు గతంలో ఎన్నడూ లేనంత తీవ్రమైన ముప్పు పొంచి ఉందని, దాన్ని కాపాడుకోవడానికి భాషాభిమానులందరూ ఉద్యమ స్థాయిలో పూనుకోవాలని పిలుపునిచ్చారు. డిగ్రీ వరకు తాను తెలుగు మాధ్యమంలోనే చదివానని, ఇంగ్లీషు అభ్యాసం 8వ తరగతిలో ఆరంభమైందని తెలిపారు. ఉద్యోగ ధర్మం కనుక ఆంగ్లంలో అభ్యాసం, వాడకం కొనసాగిస్తున్నానని, పల్లెటూళ్లో పుట్టి, ప్రభుత్వ పాఠశాలలో మాతృభాషలో చదువుకుని తాను ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. పాఠ్య పుస్తకాలు, విద్యాబోధన వ్యావహరికంలో సాగడం తనలాంటి వారికి ఎంతగానో ఉపయోగపడిందని అన్నారు. గ్రాంధికం కొనసాగి ఉంటే బహుశా తాను జీవితంలో ఎప్పడూ పొన్నవరం దాటి ఉండే వాడినో కాదేమో అన్నారు. జపాన్, చైనాలు పరాయిభాషల మోజులో పడలేదని, తమ భాషలోనే విద్యను బోధిస్తూ అన్ని రంగాల్లో అగ్రస్థాయికి చేరుకున్నాయని రమణ అన్నారు. నిజానికి ఆ దేశాల సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక శక్తి బయటి వారిని సైతం చైనీస్, జపనీస్ భాషలు నేర్చుకునేలా పురి కొల్పుతున్నాయని వ్యాఖ్యానించారు.
కార్యక్రమ నిర్వాహకులు దక్షిణాఫ్రికా తెలుగు సంఘం సంస్థాపక అధ్యక్షుడు పెట్లూరు విక్రమ్‌కు, వీధి అరుగు సంస్థాపక అధ్యక్షుడు వెంకట్ తరిగోపులకు జస్టిస్ రమణ అభినందనలు తెలిపారు. మండలి బుద్ద ప్రసాద్, గరికిపాటి నరసింహారావు, కొలకలూరి ఇనాక్, గిడుగు స్నేహలత, తరిగోపుల వెంకట్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.













