భారత్ కు గూగుల్ మరోసారి… భారీ సాయం

భారతదేశానికి మద్దతుగా టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ భారీ సాయాన్ని ప్రకటించింది. గూగుల్ భారత్‍కు రూ.113 కోట్లు (15.5 మిలియన్ల డాలర్లు) కరోనా సాయాన్ని అందించనుంది. ఈ మేరకు గూగుల్ ఒక సమావేశంలో తెలిపింది. భారత్‍లో 80 ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పడంతో పాటు వివిధ సంస్థల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య కార్యకర్తల సంఖ్యను పెంచే కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఇందులో భాగంగా గివ్ ఇండియా సంస్థకు 90 కోట్ల రూపాయలు, 18.5 కోట్ల రూపాయలను పాత్ సంస్థకు అందించనుంది. అంతేకాకుండా కొవిడ్ 19 కోసం గ్రామీణ ప్రాంతాల్లోని 20 వేల మందికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను చేపడుతున్న అపోలో మెడ్‍స్కిల్స్కు ఆర్థిక సహకారాన్ని అందించనున్నట్లు గూగుల్ ప్రకటించింది. 15 రాష్ట్రాల్లో ఆశా కార్యకర్తలు, ఏఎన్‍ఎంలకు నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆర్మాన్ సంస్థకు 3.6 కోట్లను మంజూరు చేయనుంది.
కరోనా సంక్షోభంలో విలవిల్లాడిన బాధితులకు సానుభూతి ప్రకటించిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ కష్ట కాలంలో భారతీయులకు సాయం చేసేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాం. ముఖ్యంగా ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం, గ్రామీణ భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల శిక్షణపై దృష్టి పెట్టామని ట్వీట్ చేశారు. ప్రజారోగ్య సమాచార ప్రచార కార్యక్రమాలు, అత్యవసర సహాయక చర్య కోసం గూగుల్ ఏప్రిల్ రూ.135 కోట్లు సాయం అందించిన సంగతి తెలిసిందే.