ఆప్ కు భారీ షాక్.. 160 కోట్లు చెల్లించాల్సిందే
ప్రభుత్వ ప్రకటనల పేరుతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సొంత ప్రచారం చేసుకుందనే ఆరోపణలపై ఢిల్లీ రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ ఇన్పర్మేషన్ అండ్ పబ్లిసిటీ (డీఐపీ) విభాగం తాజాగా స్పందించింది. ఈ మేరకు ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసింది. గతేడాది ప్రకటనలకు వెచ్చించిన సొమ్ముతో పాటు పెనాల్టీ మొత్తంతో కలిపి దాదాపుగా రూ.163.62 కోట్లు కట్టాలంటూ ఆదేశించింది. ఈ మొత్తాన్ని పది రోజుల్లోగా ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని నోటీసుల్లో పేర్కొంది. గడువులోగా కట్టకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
కాగా, మార్చి 31, 2017 వరకు ప్రకటనల కోసం ఆప్ రూ.93,31,10,053 (రూ.99.31 కోట్లు) ఖర్చు చేసినట్లు తెలిపింది. దీనికి ప్రజాధనాన్ని పార్టీ అవసరాలకు వినియోగించుకున్నందుకు గాను జరిమానా, వడ్డీగా మర రూ.64,30,78,212 (రూ.64.31 కోట్లు) కోట్లు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది. దీంతో మొత్తం 163.62 కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమచేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ప్రకటనలతో ఢిల్లీ లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆరోపించారు. ప్రభుత్వ ప్రకటనలను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారానికి ఉపయోగించుకుంటోందని ఇందుకోసం రూ.97 కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు. ఈ మొత్తాన్ని పార్టీ అధినేత కేజ్రీవాల్ నుంచి వసూలు చేయాలని సంబంధిత అధికారులను ఎల్జీ సక్సేనా ఆదేశించారు. ఎల్జీ ఆదేశాల మేరకు తాజాగా ఆప్‌కు డీఐపీ నోటీసులు జారీ చేసింది.













