కోవిడ్ ఫై మోదీ వ్యూహం ఏమిటో?
ప్రస్తుతం మనదేశం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. కరోనా మహమ్మారి తుపాన్‌లా విరుచుకుపడుతోంది. ఎక్కడికక్కడ కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయే తప్ప తగ్గని చోటు లేదు. దానికితోడు ప్రజల్లో ఉన్న నిర్లక్ష్యం కరోనాకు ప్లస్ పాయింట్ అయి నెత్తికెక్కి ప్రాణాలను తీస్తోంది. మరోవైపు వ్యాక్సిన్లతో దీనికి చెక్ పెడుతామంటూ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అంటూ, అందరూ వ్యాక్సిన్లు వేసుకోవాలంటూ కోరుతోంది. అస్సలు కోవిడ్ మహమ్మారి ఇంతలా పెరిగిపోవడానికి ఎవరు కారకులు ప్రభుత్వమా? ప్రజలా అంటే ఇద్దరూ అని చెప్పవచ్చు. ఓవైపు ప్రభుత్వం తనకు తోచినట్లుగా ముందుకెళుతోంది. ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. మరోవైపు ప్రజలు కూడా కరోనా మనల్ని ఏమి చేయదులే అన్న ధీమాతో రక్షణ కవచాలు వేసుకోకుండా వీధుల్లోకి వచ్చేస్తున్నారు. పేరుకు అది చిన్న వైరస్ అయినా దానికి ముక్కులో రవ్వంత చోటిస్తే ప్రాణాలను తోడేస్తుందన్న విషయం అనుభవంలోకి వచ్చిన తరువాతగాని తెలీలేదు. ఇప్పటికీ చాలామందిలో కరోనాపై పెద్దగా అవగాహన కనిపించడంలేదు. బయట ఆస్పత్రుల్లో నిండిపోయి వైద్యం దొరక్క, ఆక్సిజన్ లేక ఎంతోమంది పిట్టల్లా రాలిపోతున్నారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో 3రోజుల్లోనే 300కుపైగా మరణాలు సంభవించాయని వార్త. అంటే రోజుకు వందమంది చొప్పున ప్రాణాలు కోల్పోతున్నారు. అస్సలు నరేంద్రమోదీ ప్రభుత్వం దీనిని ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉండా అంటే లేదు. ఎన్నికలపై పెట్టిన దృష్టిని కరోనా నివారణపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెట్టలేదని తెలుస్తోంది. చేతులు కాలాక ఇప్పుడు దీనిపై ఆయన సమావేశాలు పెడుతున్నారు.
దేశంలో కరోనా మహమ్మారి విలయతాడవం చేస్తోంది. సెకండ్ వేవ్ తో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు కరోనా వ్యాక్సిన్ వేసుకునేందుకు భారీగా ముందుకు రావడంతో కరోనా వ్యాక్సిన్లకు డిమాండ్? పెరిగింది. దీంతో ఆ డిమాండ్ కు తగ్గట్టు వ్యాక్సిన్ ఉత్పతి పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ప్రజలకు వ్యాక్సిన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వ్యాక్సిన్ల సేకరణను ప్రభుత్వం సరళీకరించడంతో దేశీ వ్యాక్సిన్ తయారీదారులు ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు సన్నద్ధమయ్యారు. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ కు కేంద్ర ప్రభుత్వం అనుమతించడంతో వ్యాక్సిన్ తయారీని ముమ్మరం చేయాలని ఫార్మా కంపెనీలు కసరత్తు సాగిస్తున్నాయి.
అదే సమయంలో వ్యాక్సిన్ తయారీకి కావాల్సిన ముడిసరుకులపై అమెరికా అమెరికా విధించిన ఆంక్షల కారణంగా వాక్సిన్ ఉత్పత్తికి ఆటంకం కలుగుతుందని పూనాలోని సీరం సంస్ధ మార్చి తొమ్మిదవ తేదీన ప్రపంచ బ్యాంకు ఏర్పాటు చేసిన వాక్సిన్ తయారీదారుల సమవేశంలో ఆందోళన వ్యక్తం చేసింది. ఆరువారాలు గడచిపోయినా ఇంతవరకు అమెరికా నుంచి ఆ విషయంలో అనుమతిని నరేంద్రమోదీ ప్రభుత్వం తెప్పించుకోలేకపోయింది. భారత వినతిని పరిశీలిస్తున్నామని, సాధ్యమైనంత త్వరలో నిర్ణయం తీసుకుంటామని జో బైడెన్ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఎప్పుడు? అన్న విషయం మాత్రం తెలీదు. అంతలోపలే ఎంతమంది జనం చనిపోతారో తెలియడం లేదు. మరోవైపు చైనా నుంచి దిగుమతులు తెచ్చుకోవడంపై దృష్టి పెట్టడం లేదు. మరోవైపు కోవిడ్ కేసులు పెరిగితే ఎలా తట్టుకోవాలన్న దానిపై కూడా సరైన వ్యూహాన్ని కేంద్రం అనుసరించడం లేదు. అన్నింటిని రాష్ట్ర ప్రభుత్వాలపైనే నెట్టివేస్తోంది. ఇవన్నీ చూస్తుంటే కోవిడ్‌ను ఎదుర్కోవడం కన్నా ఎన్నికలు ఇతర విషయాలకు ఇన్నాళ్ళు నరేంద్రమోదీ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది.













