Rafale Jets: భారత అమ్ములపొదిలో మరో 114 రఫేల్ యుద్ధ విమానాలు?
భారత వైమానిక దళాన్ని (IAF) మరింత శక్తిమంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron) ఈ నెలాఖరులో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు ముందే 114 రఫేల్ యుద్ధ విమానాల (Rafale Jets) కొనుగోలు ఒప్పందానికి రక్షణ శాఖ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు రూ. 3.25 లక్షల కోట్ల విలువైన ఈ ఒప్పందం భారత రక్షణ చరిత్రలోనే అతిపెద్దదిగా నిలవనుంది. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో పెరుగుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి, వైమానిక దళంలో తగ్గుతున్న స్క్వాడ్రన్ల సంఖ్యను భర్తీ చేయడానికి ఈ నిర్ణయం అత్యంత కీలకం కానుంది. ప్రస్తుతం మంజూరైన 42 స్క్వాడ్రన్లకు గాను, కేవలం 29 స్క్వాడ్రన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) రాబోయే రోజుల్లో సమావేశమై ఈ రఫేల్ (Rafale Jets) ప్రాజెక్టుకు యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెస్సిటీ (Acceptance of Necessity-AoN) మంజూరు చేసే అవకాశం ఉంది. డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ బోర్డ్ (DPB) ఇప్పటికే దీనికి పచ్చజెండా ఊపింది. ఈ కొత్త ఒప్పందం ప్రకారం, 114 రఫేల్ విమానాల్లో 18 విమానాలను నేరుగా ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకుంటారు. మిగిలిన 96 విమానాలను ‘మేక్ ఇన్ ఇండియా’ (Make in India) పథకంలో భాగంగా దేశీయంగానే తయారు చేస్తారు. ఇందులో దాదాపు 60 శాతం పరికరాలు స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తారు. దసో ఏవియేషన్ (Dassault Aviation) భారతీయ ప్రైవేట్ కంపెనీలతో జతకట్టి ఈ విమానాలను ఇక్కడే ఉత్పత్తి చేయనుంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
కొత్తగా చేరబోయే (Rafale Jets) విమానాల్లో 88 సింగిల్-సీటర్లు, 26 ట్విన్-సీటర్లు ఉంటాయని సమాచారం. ఇప్పటికే భారత్ వద్ద ఉన్న 36 రఫేల్ విమానాలు అద్భుతమైన పనితీరును కనబరుస్తున్నాయి. మెటియోర్ (Meteor), స్కాల్ప్ (SCALP) వంటి అధునాతన క్షిపణులను మోసుకెళ్ళగల సామర్థ్యం రఫేల్‌కు ఉంది. ఈ ఒప్పందం ఖరారైతే, రాబోయే దశాబ్దాల్లో భారత గగనతల రక్షణకు తిరుగుండదని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మాక్రాన్ పర్యటన సమయంలో దీనిపై స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.













