యూపీ ఎన్నికలపై… కేజ్రీవాల్ కీలక నిర్ణయం
ఆమ్ ఆద్మీ పార్టీ 2022లో ఉత్తరప్రదేశ్‌కు జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్ ప్రకటించారు. రాష్ట్రంలోని అధికార బీజేపీ, విపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు. అవినీతి నేతల కుళ్లు రాజకీయాల కారణంగా ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి నోచుకోవడం లేదని అన్నారు. యూపీలోని రాజకీయ పార్టీలు ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నాయని, రాష్ట్ర రాజకీయాల్లో నిజాయితీ కొరవడిందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఇటీవల జరిగిన గోవా జిల్లా పంచాయతీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారి ఖాతా తెరవడం ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపింది. పార్టీ సామర్థ్యానికి ఇది ప్రారంభం మాత్రమేనని కేజ్రీవాల్ పేర్కొన్నారు. సౌత్ గోవాలోని బెనౌలిమ్ సీటులో ఆప్ అభ్యర్థి హాంజెల్ ఫెర్నాండెజ్ గెలుపొందారు.













