బీజేపీ నేతలను కాల్చి చంపేసిన ఉగ్రవాదులు
జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి విజృంభించారు. కుల్గాం జిల్లాలో బీజేపీకి చెందిన ముగ్గురు నేతలను కాల్చి చంపారు. కుల్గాం భారతీయ జనతా యువమోర్చా జిల్లా కార్యదర్శి హుస్సేన్, సభ్యులు ఉమర్ హజం, ఉమర్ రషీద్ బేగ్… ఈ ముగ్గుర్నీ ఉగ్రవాదులు కాల్చి చంపారు. అయితే ఈ ఘటనకు తామే బాధ్యులమని టీఆర్ఎఫ్ ప్రకటించింది. ఈ ఘటనతో కుల్గాంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పాల్సిందేనని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. బీజేపీ నేతల కాల్చివేతపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వారందరూ బీజేపీ ఎదుగుదలకు ఎంతో శ్రమిస్తున్నారని, అలాంటి వారిని దారుణంగా హతమార్చడాన్ని తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. దాయాది పాకిస్తాన్ కచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని జమ్మూకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా మండిపడ్డారు. కుల్గాం జిల్లాలోని వైకే పొరా ప్రాంతంలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ నేపథ్యంలోనే రవీందర్ రైనా పై విధంగా స్పందించారు. ‘‘వారు చాలా ధైర్యం గల కార్యకర్తలు. వారు భారత మాత కోసం బలిదానమయ్యారు. వారి త్యాగాలు ఊరికే పోవు. ఈ పాపానికి పిరికి పందైన పాకిస్తాన్ త్వరలోనే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.’’ అని రవీందర్ రైనా మండిపడ్డారు.
మాకు రక్షణ కల్పించండి : బీజేపీ డిమాండ్
ఇప్పటికి 8 సార్లు తమ నేతలపై ఉగ్రదాడులు జరిగాయని, తమ నేతలకు తగిన రక్షణ కల్పించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు పోలీసులు చేపడుతున్నారని, అయినా ఎలాంటి లాభం లేకుండా పోతోందని, తమ నేతలకు రక్షణ కల్పించాల్సిందేనని బీజేపీ నేతలు గట్టిగా కోరుతున్నారు. తమ మాట ఎలా ఉన్నా…. కార్యకర్తలకు రక్షణ కల్పించాల్సిందేనని అగ్ర నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే తాము పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్టు పార్టీ నేత సోఫి యూసుఫ్ తెలిపారు.













