అమెరికా శాస్త్రవేత్తల కీలక పరిశోధన
మానవుల్లో ముదిమి రాకను ఆలస్యం చేయడంతో పాటు ఆయుర్దాయాన్ని పెంచే దిశగా శాస్త్రవేత్తలు కీలక పరిశోధనలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మట్టిలో ఎక్కువగా కనిపించే సి.ఎలిగన్స్ నెమటోడ్ క్రిముల నాడీ వ్యవస్థలోని ఎన్పీఆర్-8 అనే ప్రొటీన్‌పై ప్రధానంగా దృష్టి సారించారు. మానవులు సహా అనేక జంతువుల చర్మం, ఎముకలు, అనుసంధాన కణజాలాల్లో కొల్లాజెన్ అనే ప్రొటీన్ కీలక భాగంగా ఉంటుంది. చర్మం ముడతలు పడటాన్ని అది ప్రభావితం చేస్తుంది. అయితే కొల్లజెన్ వ్యక్తీకరణను నియంత్రించగల సామర్థ్యం ఎన్పీఆర్-8కు ఉందని అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. ఎన్పీఆర్-8ను తొలగించే కొద్ది సి.ఎలిగన్స్ నెమటోడ్ల చర్మం తక్కువగా ముడతలు పడుతున్నట్లు తాము గుర్తించామని తెలిపారు. భవిష్యత్తులో మానవుల చర్మం ముడతలు పడటాన్ని తగ్గించేందుకు, ఆయుర్దాయాన్ని పెంచే కీలక ఆవిష్కరణలకు తమ పరిశోధనలు దోహదపడే అవకాశముందని వెల్లడించారు.













