కొలువుపోయినా… అక్కడే ఉండొచ్చు
టెక్ సెక్టార్లో భారీ లే ఆఫ్ల మధ్య హెచ్ 1బీ వీసా బాధితులకు అమెరికా ఇమిగ్రేషన్ శుభవార్త చెప్పింది. సాంకేతికరంగంలో కొనసాగుతున్న తొలగింపుల నేపథ్యంలో హెచ్ 1బీ వీసా ఉండి, తొలగింపునకు గురైన ఉద్యోగులు 60 రోజుల్లోపు అమెరికా వీడాలన్నది వాస్తవం కాదని అమెరికా ఇమిగ్రేషన్ సేవల సమాఖ్య ఏజెన్సీ స్పష్టం చేసింది. ఇటు వంటి ఉద్యోగులకు అమెరికాలో కొనసాగేందుకు బహుళ అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు భారత పౌండేషన్, భారత వలసల అధ్యయన కేంద్రానికి యూఎస్సీఐఎస్ డైరెక్టర్ ఓ లేఖ రాస్తూ ముఖ్యంగా సాంకేతికరంగంలో అసంకల్పిత తొలగింపుల సమస్య తీవ్రత మాకు తెలుసు. బాధిత కుటుంబాల ఆర్థిక, భావోద్వేగ పరమైన సమస్యలను అర్థం చేసుకోగలం అని తెలిపారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమేజాన్ వంటి కంపెనీలు ఈ మధ్య వరుసగా ఉద్యోగులను తొలగించాయి. ఇందులో భారతీయులు కూడా ఉన్నారు.













