రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కు ఘన స్వాగతం
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విదేశీ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకా చేరుకున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం సతీమణి సవితా కోవింద్, కుమార్తె స్వాతి కోవింద్‌తో ఢాకా చేరుకున్న రాష్ట్రపతి ఆ దేశ ఆర్మీ, నేవీ, వైమానిక దళ సిబ్బంది రెడ్ కార్పెట్ స్వాగతం పలికింది. 21 తుపాకులతో సెల్యూట్ చేసి గౌరవించారు. విమానాశ్రయంలో బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, ఆయన సతీమణి రషీదా రాష్ట్రపతి దంపతులకు స్వాగతం పలికారు. 1971 లో పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం లభించగా ప్రస్తుతం ఆ దేశం 50వ స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకొంటోంది. ఈ సందర్భంగా జరిగే 50వ విక్టరీ డే వేడుకలకు గౌరవ అతిథిగా భారత్ తరపున రాష్ట్రపతి ప్రాతినిథ్యం వహించనున్నారు.













