భారతీయ అమెరికన్ సీఆర్ రావు కు అత్యున్నత పురస్కారం
ప్రపంచ ప్రఖ్యాత గణాంక, గణిత శాస్త్రవేత్త, భారతీయ-అమెరికన్ అయిన కల్యంపూడి రాధాకృష్ణారావుకు (సీఆర్ రావు) స్టాటిస్టిక్స్ రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. 75 ఏళ్ల కిందట గణాంక రంగంలో విప్లవాత్మకమైన ఆలోచనలకు బీజం వేసినందుకుగానూ ఆ రంగంలో నోబెల్ బహుమతికి సమానమైన గణాంక బహుమతిని 2023 సంవత్సరానికి ఆయన అందుకోనున్నారు. 75 సంవత్సరాల క్రితం రావు చేసిన కృషి, ఇప్పటికీ సైన్స్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతూనే ఉందని ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే జులైలో కెనడాలోని అట్టావాలో జరిగే కార్యక్రమంలో సీఆర్ రావు ఈ అవార్డును అందుకుంటారు. 102 ఏళ్ల సీఆర్ రావుకు అవార్డుతో పాటు 80 వేల అమెరికన్ డాలర్లను బహుమతిగా ఇవ్వనున్నారు. 1945లో కోల్‌కతా మేథమేటికల్ సొసైటీలో ప్రచురితమైన సీఆర్ రావు పరిశోధన పత్రానికి ఈ అవార్డు దక్కింది. 5 ప్రముఖ అంతర్జాతీయ గణాంక సంస్థల సహకారంతో ప్రతి రెండు సంత్సరాలకు ఒకసారి ఈ బహుమతిని అందజేస్తారు.













